Breaking News

అమెరికా వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి కోర్టులో ఎదురుదెబ్బ

అమెరికా వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి కోర్టులో ఎదురుదెబ్బ


Published on: 26 Sep 2025 15:38  IST

కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గత ఏడాది అమెరికా పర్యటనలో సిక్కుల మత స్వేచ్ఛపై చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై వారణాసిలో కేసు నమోదు కావడంతో రాహుల్ గాంధీ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. దీంతో ప్రత్యేక కోర్టు విచారణను ఆయన ఎదుర్కోవాల్సి ఉంటుంది.

వివాదాస్పద వ్యాఖ్యలు ఎలా వచ్చాయి?

2024లో అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ వాషింగ్టన్ డీసీ సమీపంలోని హండన్‌లో జరిగిన సమావేశంలో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సమయంలో ఆయన “భారతదేశంలో సిక్కులు తలపాగాలు ధరించడం, కడియాలు పెట్టుకోవడం, గురుద్వారాలకు వెళ్లడం వంటి విషయాలపైనే ఘర్షణలు జరుగుతున్నాయి. వారికి స్వేచ్ఛ లేకుండా పోతోంది” అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు బీజేపీ తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. వారణాసికి చెందిన నాగేశ్వర్ మిశ్రా అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించి, రాహుల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

కోర్టు విచారణలో మలుపులు

మొదటగా అదనపు న్యాయమూర్తి (అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్) ఈ పిటిషన్‌ను “ఈ వ్యాఖ్యలు అమెరికాలో జరిగాయి కాబట్టి మన కోర్టు పరిధిలోకి రావు” అంటూ 2024 నవంబరులో తోసిపుచ్చారు. అయితే మిశ్రా రివిజన్ పిటిషన్ దాఖలు చేయగా, 2025 జూలై 21న ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు ఆ పిటిషన్‌ను స్వీకరించి, విచారణ చేపట్టాలని ఆదేశించింది.

ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. తన రివిజన్ పిటిషన్‌లో ఆయన “ఈ కేసు చట్టబద్ధం కాదు, కోర్టు పరిధిలోకి రావడం లేదు” అని వాదించారు. అయితే హైకోర్టు ఆయన వాదనను తిరస్కరించింది.

హైకోర్టు తీర్పుతో, రాహుల్ గాంధీపై వారణాసి ప్రత్యేక కోర్టులో విచారణ కొనసాగనుంది. అమెరికాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భారత కోర్టులో చట్టపరమైన ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.

Follow us on , &

ఇవీ చదవండి