Breaking News

బిహార్ రాజకీయాల్లో కొత్త పార్టీతో రంగంలోకి తేజ్ ప్రతాప్ యాదవ్

బిహార్ రాజకీయాల్లో కొత్త పార్టీతో రంగంలోకి తేజ్ ప్రతాప్ యాదవ్


Published on: 26 Sep 2025 15:45  IST

బిహార్ మాజీ ఆరోగ్య మంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు. ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీకి “జన్‌శక్తి జనతా దళ్” అని పేరు పెట్టారు. పార్టీకి ఎన్నికల గుర్తుగా “బ్లాక్ బోర్డు” (Black Board)ను ఎంపిక చేశారు. ఈ పార్టీ పోస్టర్‌ను తేజ్ ప్రతాప్ తన అధికారిక X (ట్విట్టర్) ఖాతా ద్వారా విడుదల చేశారు.

తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ, “బిహార్ సర్వతోముఖాభివృద్ధి కోసం కొత్త సిస్టమ్‌ను తీసుకురావడమే మా లక్ష్యం. ప్రజలకు నిజమైన మార్పు అందించాలనుకుంటున్నాం” అని తెలిపారు.

పార్టీ పోస్టర్‌లోని ప్రత్యేకత

‘జన్‌శక్తి జనతా దళ్’ పోస్టర్‌లో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేడ్కర్, రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్, కర్పూరి ఠాకూర్‌ల చిత్రాలు కనిపిస్తున్నాయి. అయితే ఆసక్తికరంగా, తేజ్ ప్రతాప్ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఫోటో మాత్రం లేకపోవడం చర్చనీయాంశమైంది. పార్టీ ప్రధాన నినాదాలు – సామాజిక న్యాయం, ప్రజా శక్తి, బిహార్ అభివృద్ధి గా పేర్కొన్నారు. అలాగే పార్టీలో చేరాలనుకునే వారికి ఒక కాంటాక్ట్ నెంబర్‌ను కూడా పోస్టర్‌లో ఇచ్చారు.

మహువా నుంచే పోటీ!

తేజ్ ప్రతాప్ తన కర్మభూమిగా భావించే మహువా నియోజకవర్గం నుంచి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. 2015లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఆయన గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి ఇంకెవరు పోటీ చేసినా ప్రజలు తమను తిరస్కరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

కుటుంబం–పార్టీ వివాదాల మధ్య కొత్త అడుగు

తేజ్ ప్రతాప్ యాదవ్ గతంలో కుటుంబం, పార్టీతో విభేదాల కారణంగా వార్తల్లో నిలిచారు. ఒక వ్యక్తిగత పోస్టు కారణంగా తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆయనను పార్టీ నుండి, కుటుంబం నుండి దూరం పెట్టారు. ఈ పరిస్థితుల్లోనే తేజ్ ప్రతాప్ తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించడం బిహార్ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి