Breaking News

భారత్లో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 భారత యువజన కాంగ్రెస్ (IYC) కార్యకర్తలు నిరసన చేపట్టారు.

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) వేదికగా ఫిబ్రవరి 20, 21 తేదీల్లో భారత యువజన కాంగ్రెస్ (IYC) కార్యకర్తలు నిరసన చేపట్టారు.


Published on: 21 Feb 2026 13:54  IST

న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) వేదికగా ఫిబ్రవరి 20, 21 తేదీల్లో భారత యువజన కాంగ్రెస్ (IYC) కార్యకర్తలు నిరసన చేపట్టారు.సుమారు 15 మంది యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సదస్సులోని ఎగ్జిబిషన్ హాల్-5లోకి ప్రవేశించి, తమ చొక్కాలు విప్పి అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు మరియు ముఖ్యంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి (India-US trade deal) వ్యతిరేకంగా వారు ఈ ఆందోళన చేపట్టారు. ప్రధాని దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడుతున్నారని వారు ఆరోపించారు.

భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తెలంగాణకు చెందిన జాతీయ సమన్వయకర్త నరసింహ యాదవ్‌తో పాటు కృష్ణ హరి, కుందన్ యాదవ్ మరియు అజయ్ కుమార్‌లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

అంతర్జాతీయ ప్రతినిధులు ఉన్న సమయంలో ఇలాంటి నిరసనలు దేశ ప్రతిష్టను దెబ్బతీస్తాయని బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శించారు.తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, అంతర్జాతీయ సదస్సును రాజకీయ వేదికగా మార్చుకోవడం గర్హనీయమని మండిపడ్డారు. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సులో ప్రసంగిస్తున్న సమయంలోనే స్వపార్టీకి చెందిన యువజన విభాగం ఇలా నిరసన తెలపడం విడ్డూరమని ఆయన పేర్కొన్నారు.యువజన కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఉదయ్‌భాను చిబ్ మాట్లాడుతూ, తాము ఏఐ సదస్సుకు వ్యతిరేకం కాదని, కేవలం యువత గళాన్ని వినిపించేందుకే ఈ శాంతియుత నిరసన చేపట్టామని సమర్థించుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి