Breaking News

ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడి..యుద్దం మొదలయ్యాక అతిపెద్ద దాడుల్లో ఒకటి

ఉక్రెయిన్పై రష్యా డ్రోన్లు, క్షిపణులతో దాడి..యుద్దం మొదలయ్యాక అతిపెద్ద దాడుల్లో ఒకటి


Published on: 07 Jun 2025 09:58  IST

ఉక్రెయిన్‌పై మరోసారి రష్యా విరుచుకుపడింది. శుక్రవారం (జూన్ 6) రాత్రి వేళ భారీ స్థాయిలో డ్రోన్లు, క్షిపణులతో దాడులు జరిపింది. ఇది ఇప్పటివరకు యుద్ధంలో జరిగిన దాడుల్లో అతిపెద్దదిగా భావిస్తున్నారు. ఈ దాడులు కేవలం సైనిక స్థావరాలకే కాకుండా, పౌరుల నివాస ప్రాంతాలపైనా జరగడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఉక్రెయిన్‌లోని కీవ్, ల్వివ్, టెర్నోపిల్, చెర్నిహివ్, క్రేమెంచుక్ నగరాలతో పాటు వోలిన్, సుమీ, పోల్టావా, ఖ్మెల్నిట్స్కీ, చెర్కాసి వంటి ప్రాంతాల్లో ఈ దాడులు జరగడం గమనార్హం.

రష్యా ఈ దాడుల్లో 407 షాహెడ్ డ్రోన్లు, 45 క్షిపణులను ప్రయోగించింది. వీటిలో క్రూయిజ్ మిసైల్‌లు, బాలిస్టిక్ రాకెట్లు ఉన్నాయి. ఈ దాడుల కారణంగా పలు నివాస భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతేకాకుండా ఇంధన మౌలిక సదుపాయాలు కూడా ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ వర్గాల ప్రకారం, ఈ దాడుల్లో ఆరుగురు మృతి చెందారు. మృతులలో ముగ్గురు ఎమర్జెన్సీ సేవల సిబ్బంది ఉన్నారు. ఇంకా 80 మందికి పైగా గాయపడ్డారు. దాడులు జరిగిన సమయంలో ప్రజలు విశ్రాంతి తీసుకుంటుండటంతో, గాయాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఉక్రెయిన్ సైనిక దళాలు రష్యా దాడులకు తీవ్ర ప్రతిస్పందన ఇచ్చాయి. మొత్తం 199 డ్రోన్లు, 30 క్షిపణులను తమ వైమానిక దళాలు గాల్లోనే చిత్తు చేశాయని ప్రకటించాయి. ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థల ద్వారా 169 డ్రోన్లను నియంత్రించగలిగామని వెల్లడించాయి. ఈ విధంగా భారీ దాడిని ఎదుర్కొన్నప్పటికీ, ఓ మోస్తరుగా దాన్ని అడ్డుకున్నామన్న విశ్వాసాన్ని ఉక్రెయిన్ వ్యక్తం చేసింది.

రష్యా మాత్రం ఈ దాడులపై తన వైపు నుండి క్లారిటీ ఇచ్చింది. ఉక్రెయిన్ ఇటీవల రష్యాలోని వైమానిక స్థావరాలపై డ్రోన్ల ద్వారా దాడులు జరపగా, వాటికి ప్రతీకారంగా ఈ దాడులు జరిపామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్ డ్రోన్ల దాడుల్లో రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్ విమానాలు నష్టపోయినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. ఆ ఘటనల నేపథ్యంలోనే రష్యా ఈ దాడులకు దిగినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలన్నీ ఉక్రెయిన్–రష్యాల మధ్య పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. ఒకరి పై మరొకరు ప్రతీకార చర్యలు కొనసాగించడం, ఆ దాడుల్లో పౌరులే ఎక్కువగా బలవడం, యుద్ధ పరిస్థితులను మరింత తీవ్రంగా మార్చుతున్నాయి. ఈ ఉద్రిక్తతలతో యుద్ధం ఇంకా ఎక్కడికి దారి తీస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. అంతర్జాతీయంగా ఈ సంఘటనలపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి

ట్రెండింగ్ వార్తలు మరిన్ని

Advertisement