Breaking News

కొడుకు జీవితంలో సెటిల్ అయ్యాడని భావించిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది

కలలు కన్న ఉద్యోగం సాధించాడు.. జీవితంలో సెటిల్ అయ్యాడని భావించిన తల్లిదండ్రులు అతడికి వివాహం నిశ్చియించారు.మరి కొద్ది నెలల్లో పెళ్లి. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది.


Published on: 04 Apr 2025 10:39  IST

జీవితమే ఎదురైన పోరాటం, కానీ...

జీవితాన్ని గొప్పగా తయారుచేసుకోవాలన్న కలలు ఎవరికుండవు? ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా నిండు నూరేళ్లు బతకాలని ఆశపడతారు. మనం చెప్పబోయే యువకుడు కూడా అలాంటి ఆశలతో జీవితం వైపు నడిచాడు. మంచి విద్య పూర్తి చేసి, తనకు ఇష్టమైన ఉద్యోగాన్ని సంపాదించాడు. తల్లిదండ్రులు గర్వంగా చూసే స్థితికి చేరాడు. కొడుకు జీవితంలో స్థిరపడిన తర్వాత అతనికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు మంచి సంబంధం చూసారు. ఇటీవలే నిశ్చితార్థం పూర్తవడంతో పెళ్లి కంటే ముందే ఇంట్లో ఆనంద వాతావరణం నెలకొంది.అయితే... అందమైన కలలు కంటున్న ఆ యువకుడి జీవితాన్ని ప్లేన్ క్రాష్ బలి తీసుకుంది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు మేళం వినిపిస్తోంది. చేతికి అంది వచ్చిన కొడుకు చేదోడుగా ఉంటాడని ఆశిస్తున్న తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగిలింది. 

గుజరాత్ రాష్ట్రంలోని జామ్‌నగర్ సమీపంలో భారత వాయుసేనకు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ కుప్పకూలిన ఘటనలో ఆ యువకుడి జీవితం ముగిసిపోయింది.28 ఏళ్ల సిద్ధార్థ్ యాదవ్ అనే వాయుసేన పైలట్, హర్యానాలోని రేవారీకి చెందినవాడు. మార్చి 23న నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 2న వివాహం చేయడానికి నిశ్చియించారు., సెలవు ముగిసిన తర్వాత విధుల్లో చేరిన సిద్ధార్థ్ మార్చి 31న తిరిగి తన డ్యూటీ మొదలుపెట్టాడు. ఏప్రిల్ 4న, విధిలో భాగంగా మరో పైలట్‌తో కలిసి జాగ్వార్ ఫైటర్ జెట్‌లో ప్రయాణించగా, సాంకేతిక లోపం తలెత్తింది. విమానం జనావాసాలపై పడితే ప్రజలకు ప్రమాదం అని గుర్తించి, విమానాన్ని జనాభా తక్కువగా ఉన్న ప్రాంతమైన సువద్ర గ్రామం సమీపంలో కూల్చే ప్రయత్నం చేశాడు. కోపైలట్ తప్పించుకోగలిగినా, సిద్ధార్థ్ మాత్రం విమానంలోనే ఉండిపోయి ప్రాణాలు కోల్పోయాడు.

సిద్ధార్థ్ కుటుంబం అనేక తరాలుగా రక్షణ దళాల్లో సేవలందిస్తున్నారు. ఆయన తాతలు, తండ్రి కూడా మిలిటరీలో పనిచేశారు. చిన్నతనం నుంచే ఎయిర్ ఫోర్స్ పై ఆసక్తితో ఎదిగిన సిద్ధార్థ్ 2016లో NDAలో ప్రవేశించి, ట్రైనింగ్ అనంతరం ఫైటర్ పైలట్‌గా చేరాడు.

తండ్రి గర్వంతో తడిచిన కన్నీళ్లు...
"నా కొడుకు ప్రజల కోసం తన ప్రాణాలను త్యాగం చేశాడు. ధైర్యంగా వ్యవహరించి, అనేక మందిని కాపాడాడు. తను లేకపోయినా, తన మార్గం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తుంది. కానీ తండ్రిగా ఈ బాధ తీరనిదే," అని మాట్లాడుతూ అతడి తండ్రి కన్నీరు పెట్టుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి