Breaking News

సుమారు 12 బిలియన్ సంవత్సరాల క్రితం గెలాక్సీని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఖగోళ శాస్త్రవేత్తలు బిగ్ వీల్ అనే భారీ గెలాక్సీని గుర్తించారు. ఇది వెలుగులోకి వచ్చిన తర్వాత.. విశ్వం పుట్టుక గురించి ఇప్పటి వరకు మనకు ఉన్న అభిప్రాయాలను ఇది సవాలు చేస్తుంది అంటున్నారు.


Published on: 07 Apr 2025 16:12  IST

ఖగోళ పరిశోధనల్లో తాజాగా వెలుగులోకి వచ్చిన “బిగ్ వీల్” అనే మహత్తర గెలాక్సీ శాస్త్రవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ గెలాక్సీ సుమారు 12 బిలియన్ సంవత్సరాల క్రితం, విశ్వం ఆరంభ దశలోనే ఏర్పడిందని గుర్తించారు. ఈ గెలాక్సీ spiral (సర్పిలాకార) ఆకారంలో ఉండటం కాకుండా అప్పటికే పూర్తి స్థాయిలో తిరుగుతూ ఉండటం,  ఇప్పటి వరకు మనకు విశ్వం పుట్టుక, గెలాక్సీ పరిమాణంపై మనకు ఉన్న అవగాహనను సవాలు చేస్తుంది అంటున్నారు

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా కనిపెట్టబడిన ఈ గెలాక్సీ పేరు "బిగ్ వీల్". ఇది ఏర్పడిన సమయంలో విశ్వం వయస్సు కేవలం 15 శాతం మాత్రమే ఉందని ఖగోళ నిపుణులు తెలిపారు. ఆ సమయంలో ఉన్న గెలాక్సీలు చిన్నవిగా, క్రమం లేనివిగా ఉండేవని భావించబడుతోంది. కానీ బిగ్ వీల్ మాత్రం అప్పటికే మన పాలపుంత లాంటి రూపాన్ని సంతరించుకోవడం, అది సర్వసాధారణం కాదని స్పష్టం చేస్తోంది.

సాధారణంగా డిస్క్ ఆకార గెలాక్సీలు అభివృద్ధి చెందడానికి బిలియన్ల సంవత్సరాలు పడుతాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. కానీ బిగ్ వీల్ గెలాక్సీ వేగంగా ఏర్పడిందన్న విషయం, శాస్త్ర సమాజానికి కొత్త ఆలోచనలకు దారితీస్తోంది. ఇది ఉన్న ప్రాంతంలో గెలాక్సీ సాంద్రత అత్యధికంగా ఉండటం వల్లే, ఇది త్వరితంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

ఈ గెలాక్సీ ఆవిష్కరణతో, విశ్వం ప్రాథమిక దశలలో గెలాక్సీలు ఎలా రూపుదిద్దుకున్నాయి అనే అంశంపై శాస్త్రవేత్తలు మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. బిగ్ వీల్ కనుగొనడం ఖగోళ విజ్ఞానంలో కీలక మలుపుగా నిలుస్తోంది. ఈ గెలాక్సీ విశ్వ చరిత్రపై మన అవగాహనను మరింత లోతుగా, విస్తృతంగా అభివృద్ధి చేయనుందని వారు నమ్ముతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి