Breaking News

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కీలక నిర్ణయం రెపో రేటును తగ్గించింది

భారతదేశంలో కరోనా వైరస్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇది రెండోసారి రెపో రేటు తగ్గించబడటం.దీని ద్వారా భారీ మొత్తంలో మీ ఈఎంఐ తగ్గినట్లే.


Published on: 09 Apr 2025 22:14  IST

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది.రెపో రేటును 6.25 శాతం నుండి 6 శాతానికి తగ్గించింది.భారతదేశంలో కరోనా వైరస్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇది రెండోసారి రెపో రేటు తగ్గించబడటం. గతంలో 2020 మే నుంచి 2022 ఏప్రిల్ మధ్యకాలంలో ఆర్‌బీఐ రెపో రేటును 4 శాతంగా కొనసాగించింది. ఆ తరువాత 2022 ఏప్రిల్ నుంచి 2023 ఫిబ్రవరి వరకు దశల వారీగా వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చిన ఆర్‌బీఐ చివరకు 6.5 శాతానికి చేర్చింది. అప్పటి నుంచి దాదాపు రెండేళ్లపాటు రెపో రేటు అదే స్థాయిలో కొనసాగుతోంది.

ఇప్పుడు ఆర్‌బీఐ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలపై తీసుకునే వడ్డీ రేట్లు తగ్గే అవకాశముంది. ఉదాహరణకు,కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి రూ.50 లక్షల హోం లోన్‌ను 30 సంవత్సరాల కాలానికి తీసుకున్నా, ఇప్పటివరకు నెలకు చెల్లించాల్సిన ఈఎంఐ సుమారు రూ.39,157గా ఉండేది. అయితే వడ్డీ రేటు 0.25 శాతం తగ్గితే, అదే ఈఎంఐ రూ.38,269కి తగ్గుతుంది. దాంతో నెలకు సుమారు రూ.888 ఆదా అవుతుంది. వడ్డీ రేటు 0.50 శాతం తగ్గినట్లయితే, నెలవారీ చెల్లింపులు మరింత తగ్గి రూ.37,388కి చేరతాయి. దీని వల్ల నెలకు రూ.1,769 వరకూ ఆదా అవుతుంది. దీన్ని వార్షికంగా లెక్కిస్తే రూ.21,000కు పైగా లాభం చేకూరుతుంది. ఇది ఒక పెద్ద ఊరటే.

ఇంకొకవైపు, వ్యక్తిగత రుణాల విషయానికి వస్తే – రూ.5 లక్షల పర్సనల్ లోన్‌ను 5 సంవత్సరాల కాలపరిమితికి తీసుకుని వడ్డీ రేటు 12 శాతంగా ఉన్నవారికి, రేటు 0.25 శాతం తగ్గితే ఈఎంఐ రూ.11,282 నుంచి రూ.11,149కి పడుతుంది. అంటే నెలకు సుమారు రూ.133, ఏడాదికి రూ.1,596 వరకు ఆదా అవుతుంది. అయితే ఇది ఫ్లోటింగ్ రేటుతో తీసుకున్న రుణాలకే వర్తిస్తుంది. ఫిక్స్డ్ వడ్డీ రేటుతో తీసుకున్నవారికి ఈ కోత ప్రయోజనం ఉండదు.

మొత్తంగా చూస్తే, రెపో రేటు తగ్గింపుతో రుణాలు తీసుకునే వారి భారం కొంత వరకు తగ్గే అవకాశం ఉంది.వినియోగదారులకు ఆర్థికంగా కొంత ఉపశమనం ఇస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి