Breaking News

కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ కుటుంబంలో విషాదం

కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ మనుమరాలు సుష్మా దేవిని ఆమె భర్త రమేష్ తుపాకీతో కాల్చి హత్య చేసిన సంఘటన అందరిని దిగ్భ్రాంతి గురిచేసింది


Published on: 09 Apr 2025 22:45  IST

బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి జితిన్ రామ్ మాంఝీ కుటుంబంలో జరిగిన ఈ విషాదం అందరిని దిగ్భ్రాంతి గురిచేసింది. మాంఝీ మనుమరాలు సుష్మా దేవిని ఆమె భర్త రమేష్ తుపాకీతో కాల్చి హత్య చేసిన దుర్ఘటన బుధవారం గయా జిల్లాలోని అత్రి బ్లాక్ పరిధిలోని టెటువా గ్రామంలో జరిగింది.ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం గయా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిందితుడు రమేష్ ప్రస్తుతం పరారీలో ఉండగా, అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు.

మృతురాలి సోదరి పూనమ్ ఇచ్చిన సమాచారం ప్రకారం, బుధవారం ఉదయం సుష్మా దేవి, రమేష్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత రమేష్ రమేష్ ఉద్యోగానికి వెళ్లారని, మధ్యాహ్నం 12.00 గంటలకు తిరిగి వచ్చి తాను తీసుకొచ్చిన తుపాకీతో సుష్మా పై కాల్పులు జరిపాడు. ఆమె అక్కడికక్కడే మరణించిందని పూనమ్ చెప్పారు. ఈ హత్య జరిగే సమయంలో తాను పిల్లలతో పాటు పక్కగదిలో ఉన్నానని, తుపాకీ శబ్దం విన్న వెంటనే బయటకు వచ్చామన్నారు.

తన సోదరిని దారుణంగా హత్య చేసిన రమేష్‌కు కఠినంగా శిక్ష వేయాలని, ఉరి శిక్ష విధించాలని పూనమ్ ప్రభుత్వాన్ని కోరారు. సుష్మా దేవి వికాస్ మిత్రగా విధులు నిర్వహిస్తోందని ఆమె తెలిపింది. సుమారు 14 ఏళ్ల క్రితం సుష్మా–రమేష్ కులాంతర వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య జరిగిన సమాచారం బయటకు రావడంతో, స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఇక జితిన్ రామ్ మాంఝీ విషయానికొస్తే, ప్రస్తుతం కేంద్ర మోదీ మంత్రివర్గంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత ఎన్నికల్లో గయా లోక్‌సభ స్థానం నుండి విజయం సాధించిన మాంఝీ, హిందూస్తానీ అవామీ మోర్చా (సెక్యులర్) పార్టీ వ్యవస్థాపకులు. ఆయన పార్టీ ఎన్డీయేకు మద్దతు ఇస్తోంది. అంతకుముందు మాంఝీ బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.

Follow us on , &

ఇవీ చదవండి