Breaking News

ఒక్క సెకన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ డేటా మొత్తం డౌన్‌లోడ్‌.. జపాన్‌లో ‘బుల్లెట్‌’ ఇంటర్నెట్‌..!

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ — జపాన్‌ కొత్త రికార్డు.


Published on: 11 Jul 2025 16:05  IST

టెక్నాలజీలో ముందుండే జపాన్‌ మరో అద్భుతాన్ని సాధించింది. అక్కడి పరిశోధకులు ఇప్పుడు సెకనుకు 1.02 పెటాబిట్స్‌ (PBps) వేగంతో పనిచేసే ఇంటర్నెట్‌ను అభివృద్ధి చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన నెట్‌వర్క్‌గా గుర్తింపు పొందింది. ఈ ఇంటర్నెట్‌ స్పీడ్‌ ఎంతగా ఉందంటే, ఒక క్షణంలోనే నెట్‌ఫ్లిక్స్‌ లైబ్రరీలో ఉన్న మొత్తం వీడియోలను డౌన్‌లోడ్‌ చేయగలదు.

జపాన్‌ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (NICT) ప్రకారం, ఈ వేగం అమెరికాలో సాధారణ ఇంటర్నెట్ కన్నా దాదాపు 35 లక్షల రెట్లు, భారత్‌లోని సగటు ఇంటర్నెట్ కన్నా 1.6 కోట్ల రెట్లు ఎక్కువగా ఉంది.

ఈ ఇంటర్నెట్ టెక్నాలజీ అభివృద్ధిలో ఫైబర్ ఆప్టిక్‌ కేబుల్స్‌, అత్యాధునిక ట్రాన్స్‌మిటర్లు, రిసీవర్లు, మరియు 86.1 కిలోమీటర్ల పొడవు గల 19 సర్క్యూట్లను ఉపయోగించారు. దీని సాయంతో సుమారు 1800 కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానానికి కూడా డేటా క్షణాల్లో చేరవేయవచ్చు.

ఇది సాధారణ వినియోగదారుల కోసం తక్షణమే అందుబాటులోకి రానప్పటికీ, ప్రభుత్వ సంస్థలు, డేటా సెంటర్లు మరియు టెలికం కంపెనీలు దీన్ని తమ అవసరాల కోసం వినియోగించే అవకాశాలున్నాయి. భవిష్యత్‌లో 6జీ నెట్‌వర్క్‌లు, సముద్ర గర్భ కేబుల్స్‌ వంటి రంగాల్లో ఈ టెక్నాలజీ కీలకపాత్ర పోషించనుంది.

Follow us on , &

ఇవీ చదవండి