Breaking News

ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం...త్వరలో 20 వేల పోస్టులకు నోటిఫికేషన్లు

సుమారు 20 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.


Published on: 15 Apr 2025 12:19  IST

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యిందన్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ప్రణాళికలు వేస్తోంది. ఈ నెలాఖరులోపు పలు శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని అధికారులు సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా టీఎస్‌పీఎస్సీ, గురుకుల విద్యాసంస్థలు, పోలీస్‌, వైద్య నియామక సంస్థల ద్వారా ఈ నియామకాలు చేపట్టనున్నారు.

ప్రస్తుతం వివిధ శాఖల్లో ఖాళీలను గుర్తించే పని చివరిదశలో ఉంది. సుమారు 20 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
2024-25 సంవత్సరానికి ప్రభుత్వం ఇప్పటికే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసినప్పటికీ, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంతవరకు నియామక ప్రకటనలు ఆపివేసింది. తాజాగా వర్గీకరణ అమలులోకి రావడంతో మరోసారి ప్రక్రియను ప్రారంభించనుంది. ప్రభుత్వ అధికారులు రెండు మూడు రోజుల్లో సమావేశమై ఖాళీల వివరాలను ఖచ్చితంగా తేల్చనున్నారని చెబుతున్నారు.


వివిధ విభాగాల్లోని ఖాళీల వివరాలను పరిశీలిస్తే, వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు వంటి పోస్టుల కోసం దాదాపు 5 వేల వరకు ఖాళీలు ఉన్నట్లు అంచనా. RTC, ఇంజినీరింగ్ శాఖల్లో కూడా భారీగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గురుకుల విద్యాసంస్థల్లో గతంలో నోటిఫికేషన్ వచ్చినప్పటికీ, రెండువేలకు పైగా పోస్టులు బ్యాక్‌లాగ్‌లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.

ఇక గ్రూప్‌-1, గ్రూప్‌-4 మరియు పోలీస్‌ శాఖల్లో కూడా భర్తీ చేయాల్సిన అనేక ఉద్యోగాలు ఉన్నట్లు సమాచారం. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్లు విడుదల చేయనుంది.

Follow us on , &

ఇవీ చదవండి