Breaking News

కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలు వెలుగు లోకి

బుధవారం తెల్లవారుజాము నుంచి ఈడీ తనిఖీలు జరిపి సురానా గ్రూప్‌కు చెందిన రూ.113.32 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసిన ఈడీ.


Published on: 17 Apr 2025 12:44  IST

సురానా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రెండోసారి చేసిన సోదాలు ముగిశాయి. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర సురానా నివాసంలో భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న ఈడీ అధికారులు... ఈ కంపెనీలు అక్రమ రీతిలో నిధులను బదిలీ చేసినట్లు గుర్తించారు.

సురానా గ్రూప్ షెల్ కంపెనీలను ఏర్పాటుచేసి బ్యాంకుల నుంచి పొందిన రుణాలను ఆ కంపెనీలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఆపై ఆ డబ్బులను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా మలిచారని వెల్లడించారు. అనుబంధ సంస్థ సాయి సూర్య డెవలపర్స్‌ అధినేత సతీష్ ఇంట్లోనూ అధిక మొత్తంలో నగదు మరియు పత్రాలు ఈడీ స్వాధీనం చేసుకుంది.

ఈ క్రమంలో సురానా గ్రూప్‌, సాయి సూర్య డెవలపర్స్‌, ఆర్యవన్ ఎనర్జీ కార్యాలయాలు, మరియు సంబంధిత డైరెక్టర్ల ఇళ్లల్లోనూ ఒకేసారి దాడులు జరిగాయి. హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలోని డైమండ్‌ పాయింట్ సమీపంలోని నివాసాల్లో బుధవారం తెల్లవారుజాము నుంచి ఈడీ తనిఖీలు జరిపింది.

పాత కేసులు – కొత్త మలుపులు

ఇప్పటికే సాయి సూర్య డెవలపర్స్ ఎండీ సతీష్‌ను సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి ప్రాజెక్ట్ పేరుతో ముందస్తు డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుల ఆధారంగా ఈడీ విచారణ మొదలుపెట్టింది.

సురానా గ్రూప్‌ చైర్మన్‌, ఇతర డైరెక్టర్లు చెన్నైలో నివసిస్తున్నప్పటికీ, వారి వ్యాపారాలు హైదరాబాద్‌ ఆధారితంగా ఉండటం వల్ల ఇక్కడే ప్రధాన దాడులు జరిగాయి. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను అనధికారికంగా అనుబంధ కంపెనీలకు మళ్లించినట్లు ఈడీ నిర్ధారించింది.

రూ.113 కోట్లకు పైగా ఆస్తుల జప్తు

మునుపటి దర్యాప్తులో సురానా గ్రూప్‌కు చెందిన రూ.113.32 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసిన ఈడీ, దినేష్‌ చంద్‌ సురానా డమ్మీ డైరెక్టర్ల ద్వారా విదేశీ కంపెనీల్లో రుణాలు మళ్లించారని తెలిపింది. క్యేమన్‌ ఐలాండ్‌, బ్రిటిష్‌ వర్జిన్‌ ఐలాండ్‌ దేశాల్లో నకిలీ డైరెక్టర్ల పేరిట కంపెనీలు ఏర్పాటు చేసి, అక్కడికి నిధులు తరలించినట్లుగా అధికారులు గుర్తించారు.సింగపూర్‌లోని నాలుగు కంపెనీల ద్వారా వస్తువుల ఎగుమతి పేరుతో డబ్బు తీసుకుని, ఆ మొత్తాన్ని తిరిగి భారత్‌లో బినామీల పేర్లలో ఆస్తులుగా మలిచినట్లు కూడా అధికారులు పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి