Breaking News

సుందర్‌ పిచాయ్‌ నికర సంపద 1.1 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు బ్లూమ్‌బర్గ్‌ ఇండెక్స్‌ వెల్లడించింది.

ఆల్ఫాబెట్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ బిలియనీర్స్‌ క్లబ్‌లోకి చేరారు. ఆయన నికర సంపద 1.1 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు బ్లూమ్‌బర్గ్‌ ఇండెక్స్‌ వెల్లడించింది.


Published on: 25 Jul 2025 09:38  IST

ప్రముఖ టెక్నాలజీ సంస్థ గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌కు సీఈఓగా పనిచేస్తున్న భారతీయ అమెరికన్ సుందర్ పిచాయ్ మరో కీలక ఘనత సాధించారు. దశాబ్దం పాటు సంస్థకు నాయకత్వం వహించిన ఆయన ప్రస్తుతం బిలియనీర్స్‌ జాబితాలో చేరారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్ ప్రకారం, ఆయన నికర ఆస్తి 1.1 బిలియన్‌ డాలర్లను అధిగమించినట్టు వెల్లడైంది.

2023 నుంచి ఆల్ఫాబెట్‌ కంపెనీ షేర్లు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ కాలంలో కంపెనీ మార్కెట్‌ విలువలో భారీ వృద్ధి జరగడం వల్ల ప్రస్తుతం ఇది 2 ట్రిలియన్‌ డాలర్లను దాటి ఉంది. ఇటీవల జరిగిన ట్రేడింగ్‌లో ఆల్ఫాబెట్‌ షేర్‌ విలువ ఒక్కరోజే 4.1 శాతం పెరగడం వల్ల పిచాయ్‌ సంపదలోనూ అనూహ్యంగా పెరుగుదల చోటుచేసుకుంది. ఫోర్బ్స్‌ లెక్కల ప్రకారం పిచాయ్‌ నికర సంపద 1.2 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్టు చెబుతోంది.

సాధారణంగా టెక్‌ రంగంలో బిలియనీర్‌గా మారే వారు తమ స్వంతంగా కంపెనీలు స్థాపించి వాటిలో వాటాలను కలిగి ఉంటారు. అయితే, పిచాయ్‌ మాత్రం సంస్థ వ్యవస్థాపకుడు కాకపోయినా, ఉద్యోగిగా ప్రారంభించి సీఈఓగా ఎదగడం ద్వారా ఈ స్థాయికి చేరడం ప్రత్యేకత. మెటా అధినేత జుకర్‌బర్గ్‌, ఎన్విడియా అధిపతి జెన్సెన్ హువాంగ్ వంటి వారు వ్యవస్థాపకులుగా షేరు వాటాల ద్వారా సంపదను కూడగట్టారు. కానీ పిచాయ్‌కు ఇది పూర్తిగా ఉద్యోగ ప్రాధాన్యత ఆధారంగా లభించింది.

ఆల్ఫాబెట్‌ ఇటీవల ప్రకటించిన రెండో త్రైమాసిక ఫలితాలు కూడా ఈ స్థిరంగా కొనసాగుతున్న వృద్ధికి నిదర్శనం. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో సంస్థకు 96.4 బిలియన్‌ డాలర్ల ఆదాయం వచ్చినట్టు ప్రకటించగా, లాభాలు 28.2 బిలియన్‌ డాలర్లను దాటాయి.

సుందర్ పిచాయ్ జీవనయానం ఎంతో ప్రేరణాత్మకం. తమిళనాడులోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన, 1993లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో స్కాలర్‌షిప్ ద్వారా ప్రవేశం పొందారు. అక్కడ చదువుదాంతో గూగుల్‌లో 2004లో ఓ సాధారణ ఉద్యోగిగా చేరారు. ఆయన కృషితో గూగుల్ క్రోమ్‌, ఆండ్రాయిడ్‌, గూగుల్ డ్రైవ్‌ వంటి ప్రయోగాలు విజయవంతమయ్యాయి. వాటి ద్వారా సంస్థ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించడంతో, 2015లో సీఈఓగా నియమితులయ్యారు. 2025 ఆగస్టులో ఆయన ఈ పదవిలో 10 సంవత్సరాలు పూర్తి చేయనున్నారు.

ఈ సాధనతో సుందర్ పిచాయ్‌ నేడు ప్రపంచ స్థాయిలో నిపుణుల అభినందనలు అందుకుంటున్నారు. ఉద్యోగిగా ప్రారంభించి ప్రపంచ టాప్ బిలియనీర్స్ జాబితాలో చోటు సంపాదించడం ఆయన నిరంతర కృషి, ప్రామాణికతకు నిదర్శనం.

Follow us on , &

ఇవీ చదవండి