Breaking News

ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త యూపీఐ రూల్స్ గురించి తెలుసా

ఆగస్టు 1 నుంచి యూపీఐ చెల్లింపుల్లో కొత్త మార్గదర్శకాలు: వినియోగదారుల కోసం కీలక మార్పులు


Published on: 26 Jul 2025 12:44  IST

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రకటించిన యూపీఐ సేవలకు సంబంధించిన కొత్త నిబంధనలు ఈ ఏడాది ఆగస్టు 1 నుండి అమల్లోకి రానున్నాయి. యూపీఐ సేవలను మరింత స్థిరంగా, నిరాటంకంగా అందించాలనే ఉద్దేశంతో ఈ మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎక్కువగా లావాదేవీలు జరిగే సమయాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఈ మార్గదర్శకాలు రూపొందించారు.

కొత్త మార్పుల ప్రకారం, ఇకపై ఆటోపే సేవలు నిర్దిష్ట సమయాల్లో మాత్రమే పనిచేస్తాయి. అంటే, సబ్‌స్క్రిప్షన్ ఫీజులు, యూటిలిటీ బిల్లులు, ఈఎమ్‌ఐల వంటి చెల్లింపులు 24 గంటలు ఎప్పుడైనా జరగలేవు. నిర్దేశిత టైమింగ్స్‌కి మాత్రమే ఇవి ప్రాసెస్ అవుతాయి. ఇది యూపీఐ ప్లాట్‌ఫారమ్‌పై వచ్చే ఒత్తిడిని తగ్గించడానికి తీసుకున్న చర్య. దీనివల్ల ఆటోపే సేవలు వాడుతున్న వ్యాపారులు తమ షెడ్యూల్‌లలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.

అలాగే, యూపీఐ వేదిక ద్వారా వినియోగదారులు రోజుకు గరిష్ఠంగా 50 సార్లు మాత్రమే బ్యాంక్ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకునే వీలు ఉంటుంది. ఇప్పటి వరకూ ఎన్ని సార్లైనా బ్యాలెన్స్ చెక్ చేసే అవకాశం ఉన్నా, ఈ కొత్త పరిమితి వల్ల సర్వర్ పై ఒత్తిడి తగ్గనుంది. సాధారణ వినియోగదారులకు ఇది పెద్ద సమస్య కాకపోయినా, తరచూ బ్యాలెన్స్ చెక్ చేసే యూజర్లకు ఇది గమనించదగ్గ మార్పు.

ఇక డిజిటల్ చెల్లింపుల భవిష్యత్తుపై కూడా కీలక వ్యాఖ్యలు నమోదయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, యూపీఐ సేవలకు ఆర్థిక సుస్థిరత అవసరమని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ప్రభుత్వమే ఈ సేవల నిర్వహణకు అయ్యే ఖర్చును భరిస్తోందని, కానీ దీర్ఘకాలంలో ఇది కొనసాగడం కష్టమని అభిప్రాయపడ్డారు. సేవలను నిలకడగా కొనసాగించాలంటే కొంతమేరకు వినియోగదారుల నుండి ఛార్జీలు వసూలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

ప్రస్తుతం భారతదేశంలో యూపీఐ ఆధారిత చెల్లింపులు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. దీనికి అవసరమైన మౌలిక వసతుల నిర్వహణ బాధ్యతను బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, ఎన్‌పీసీఐ చేపడుతున్నారు. కానీ వినియోగదారులు మాత్రం ఉచితంగా ఈ సేవలను పొందుతున్నారు. భవిష్యత్తులో ఈ ఉచితత కొనసాగుతుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఈ మార్పులు యూపీఐ వాడకాన్ని మరింత సమర్థవంతంగా చేయడమే కాకుండా, భవిష్యత్తులో ఈ సేవల సుస్థిరత కోసం ముందస్తు అడుగులుగా భావించవచ్చు. వినియోగదారులు, వ్యాపారులు ఈ మార్పులను అర్థం చేసుకొని తమ ఉపయోగంలో తగిన మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి