Breaking News

అసోం రాష్ట్రంలోని ఏఐయూడీఎఫ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం అరెస్ట్

ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ వైరల్ కావడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.


Published on: 25 Apr 2025 15:25  IST

అసోం, ఏప్రిల్ 25: జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై స్పందిస్తూ పాకిస్థాన్‌కు అనుకూలంగా మాట్లాడిన అసోం రాష్ట్రంలోని ఏఐయూడీఎఫ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ వైరల్ కావడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.అయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచినట్టు జిల్లా ఎస్పీ స్వప్ననీల్ దేకా తెలిపారు. ఈ వీడియోలో ఉగ్రదాడిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. వీడియోను గమనించిన వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకున్నామని పోలీస్ శాఖ వెల్లడించింది.

సీఎం హిమంత బిస్వా శర్మ స్పందన

ఈ అంశంపై అసోం సీఎం హిమంత బిస్వా శర్మ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అమాయకులపై జరిగిన దాడిని సమర్థించడం అభ్యంతరకరమని, ఇది స్వేచ్ఛా భావనకు విరుద్ధమని అన్నారు. ఇది భారత దేశ ఆత్మను దెబ్బతీయడమేనని స్పష్టం చేశారు. విలేకర్లతో మాట్లాడిన సందర్భంగా ఎమ్మెల్యేను కోర్టుకు హాజరుపరిచామని చెప్పారు.

ఏఐయూడీఎఫ్ పార్టీ నేత స్పందన

ఇంకా ఈ వివాదంపై పార్టీ అధ్యక్షుడు బదరుద్దిన్ అజ్మల్ స్పందిస్తూ, ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. అవి తమ పార్టీ ధోరణి కాదన్నారు. ఈ దాడిని ఇప్పటికే ఖండించామని, ఇలాంటి ఘటనల్లో మతాన్ని లాగడం తగదని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి