Breaking News

ఏరోస్పేస్ రంగంలో ఏపీకి పెద్ద అవకాశాలు – ఎయిర్‌బస్‌ను ఆహ్వానించిన మంత్రి నారా లోకేశ్

ఏరోస్పేస్ రంగంలో ఏపీకి పెద్ద అవకాశాలు – ఎయిర్‌బస్‌ను ఆహ్వానించిన మంత్రి నారా లోకేశ్


Published on: 01 Oct 2025 08:02  IST

వాణిజ్య విమానాలు, డిఫెన్స్ సిస్టమ్స్, స్పేస్, హెలికాప్టర్ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఎయిర్‌బస్ సంస్థను ఆంధ్రప్రదేశ్‌లోకి ఆహ్వానిస్తూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక ప్రయత్నం చేశారు. దాదాపు రూ.16 లక్షల కోట్ల విలువైన వ్యవస్థను నడిపించే ఈ అంతర్జాతీయ సంస్థ తొలిసారి భారత్‌లో తయారీ అవకాశాలను అన్వేషించడానికి తమ పాలకమండలి సభ్యులతో వచ్చి సమావేశమైంది.

మంగళవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి లోకేశ్ ఎయిర్‌బస్ బోర్డు సభ్యులను కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వనరులు, పెట్టుబడుల అవకాశాలు, అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక వసతులు గురించి వివరించారు. రాష్ట్రంలో ప్రపంచస్థాయి ఏరోస్పేస్ తయారీ కేంద్రం ఏర్పాటు చేసుకోవడానికి ఉన్న అనుకూలతలపై ప్రత్యేక ప్రజంటేషన్ కూడా ఇచ్చారు.

ఏకీకృత కేంద్రం ఏర్పాటు చేయండి – లోకేశ్ ప్రతిపాదన

ఎయిర్‌బస్ మాత్రమే కాకుండా, అనుబంధ సప్లై చైన్ కంపెనీలు, MSMEలు, భాగస్వామ్య సంస్థలు అన్నీ ఒకేచోట కార్యకలాపాలు నిర్వహించుకునేలా ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. దీంతో తక్కువ ఖర్చుతోనే అధిక నాణ్యత గల ఉత్పత్తులు తయారవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పలు ఏరోస్పేస్ కారిడార్లు అభివృద్ధి చేస్తోన్నామని, వాటిలో తమ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌బస్ ఎంచుకోవచ్చని వివరించారు. “ఏపీ ప్రభుత్వం ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ధోరణిలో వేగంగా అనుమతులు ఇస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం” అని లోకేశ్ వివరించారు.

ఎయిర్‌బస్ యూనిట్‌కు ఏపీ అన్ని విధాల అనుకూలం

సమావేశం అనంతరం మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, ఎయిర్‌బస్ యూనిట్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా అనుకూల రాష్ట్రమని స్పష్టంచేశారు. "ప్రపంచ ఏరోస్పేస్ రంగంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన సంస్థ ఎయిర్‌బస్. ఇలాంటి ప్రాజెక్ట్ కోసం అవసరమైన భూమి, వసతులు, లాజిస్టిక్స్ అన్ని సిద్ధంగా ఉన్నాయి. వెంటనే (Plug & Play) విధానంలో పనులు ప్రారంభించుకునే అవకాశం ఇస్తాం" అని చెప్పారు.

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మాట్లాడుతూ, చంద్రబాబు – లోకేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడానికి వేగంగా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏరోస్పేస్ పాలసీ రూపొందించిందని, దాంతో భవిష్యత్ ప్రాజెక్టులు త్వరగా ముందుకు సాగుతాయని పేర్కొన్నారు.

మొత్తానికి, ఎయిర్‌బస్ ఆంధ్రప్రదేశ్‌లో తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తే, అది కేవలం రాష్ట్రానికే కాకుండా భారతదేశం ఏరోస్పేస్ హబ్‌గా ఎదగడానికి పెద్ద మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి