Breaking News

అమరావతి పునర్నిర్మాణ యుగం ప్రారంభం – ప్రజా రాజధానిగా ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్న సీఎం చంద్రబాబు

అమరావతి పునర్నిర్మాణ యుగం ప్రారంభం – ప్రజా రాజధానిగా ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్న సీఎం చంద్రబాబు


Published on: 14 Oct 2025 10:28  IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు వేశారు. రాయపూడిలో నిర్మించిన కొత్త ఏపీ సీఆర్‌డీఏ (CRDA) కార్యాలయాన్ని ఆయన వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య సోమవారం ఉదయం రైతులతో కలిసి ప్రారంభించారు. ఈ భవనంలో సీఆర్‌డీఏతో పాటు అమరావతి అభివృద్ధి సంస్థ, పురపాలక శాఖ వంటి అన్ని విభాగాలు ఒకే చోట నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నాయి.

సీఎం ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ, “ఒక్కసారి జరిగిన తప్పిదం వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో మనం చూశాం. ఇకపై అలాంటి తప్పులు జరగనీయం” అని అన్నారు. 2047 వరకు కూటమి ప్రభుత్వం కొనసాగాలన్నది తన లక్ష్యమని తెలిపారు. అప్పుడే భారతదేశం ప్రపంచంలో నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని, ఆ ప్రగతికి ఆంధ్రప్రదేశ్ ఇంజన్‌గా ఉంటుందని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్, బీజేపీతో కలిసి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

చంద్రబాబు మాట్లాడుతూ, “అమరావతి ప్రపంచంలో ఎక్కడా లేని నగరంగా రూపుదిద్దుకుంటుంది. ప్రజా ధనం ఖర్చు చేయకుండా స్వీయ ఆదాయంతో అభివృద్ధి చెందే నగరం ఇది. అమరావతి కోసం తమ భూములు ఇచ్చిన రైతులు, మహిళలు చేసిన త్యాగాలు మరువలేనివి. వారికి రెట్టింపు గౌరవం, ఫలితాలు అందించే బాధ్యత నాది” అని తెలిపారు.

అమరావతిని ఆధునిక సాంకేతికతతో కూడిన భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దుతానని సీఎం హామీ ఇచ్చారు. “హైటెక్ సిటీని తీసుకొచ్చినప్పుడు ఎలా వ్యతిరేకత ఎదురైందో, ఇప్పుడు రాజధానిపైనా అదే జరుగుతోంది. కానీ ఈసారి నిరూపణతో ముందుకు వెళ్తాం. గ్రీన్ ఎనర్జీ వ్యాలీ, ఏఐ డేటా సెంటర్, క్వాంటం కంప్యూటింగ్ హబ్ లాంటి ప్రాజెక్టులను అమరావతికి తీసుకొస్తున్నాం” అని చెప్పారు.

రైతులు, మహిళలు రాజధాని కోసం చేసిన పోరాటాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. “ఆవేశం, అవమానం, బాధ అన్నీ చూశాం. కానీ వారి త్యాగాలు వృథా కావు. నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా. అమరావతి పునాదులు బలంగా ఉన్నాయి, విశాఖ కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అత్యధిక విదేశీ పెట్టుబడులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నాయి” అని చంద్రబాబు నాయుడు తెలిపారు.

తన ప్రసంగం చివర్లో, “వేంకటేశ్వర స్వామి దయతో దేవతల రాజధాని లాంటి అమరావతిని నిర్మించే అవకాశం కలగాలని కోరుకుంటున్నా. ఇది కేవలం రాజధాని కాదు – ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి