Breaking News

క్రైస్తవ మతంలోకి మారిన వెంటనే ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ చట్టం నుంచి రక్షణ పొందలేరని న్యాయస్థానం స్పష్టం చేసింది.

క్రైస్తవ మతంలోకి మారిన వెంటనే షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) హోదా వర్తించదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్పష్టంగా పేర్కొంది


Published on: 02 May 2025 14:27  IST

అమరావతి: ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారిన వెంటనే అతనికి షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) హోదా వర్తించదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. అలాంటి వారు ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ చట్టం నుంచి రక్షణ పొందలేరని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈ వ్యాఖ్యలు ఒక కేసు విచారణ సందర్భంగా వెలువడ్డాయి. గుంటూరు జిల్లాకు చెందిన చింతాడ ఆనంద్‌ అనే పాస్టర్‌ 2021లో చందోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని రామిరెడ్డి సహా మరో ఐదుగురిపై తాను కులపరంగా అవమానాన్ని ఎదుర్కొన్నానని, శారీరక దాడి జరిగినట్లు ఆరోపించారు. పోలీసులు ఈ ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు.అయితే, నిందితులు ఈ కేసు తప్పుపడుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా నిందితుల తరఫు న్యాయవాది వాదిస్తూ – ఆ పాస్టర్ పదేళ్లుగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారు, అలాంటి వారికి ఎస్సీ చట్టం వర్తించదని తెలిపారు. 1950 రాజ్యాంగ షెడ్యూల్‌ కులాల ఆర్డర్‌ ప్రకారం, హిందూమతాన్ని విడిచి ఇతర మతాలలోకి మారినవారికి ఎస్సీ హోదా ఉండదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కూడా గతంలో స్పష్టం చేసిందని గుర్తు చేశారు.

దీనిపై పాస్టర్‌ ఆనంద్‌ తరఫు న్యాయవాది మాట్లాడుతూ – తహసీల్దార్‌ ఇచ్చిన ధ్రువీకరణ పత్రం ప్రకారం ఆయనకు ఎస్సీ సర్టిఫికెట్‌ ఉందని వాదించారు.తుది తీర్పులో న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌. హరినాథ్‌ మాట్లాడుతూ – క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఫిర్యాదుదారునికి ఎస్సీ హోదా వర్తించదు. కాబట్టి ఆయన ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరు. అతని ఫిర్యాదుపై ఎత్తిన ఐపీసీ సెక్షన్లు కూడా చెల్లవని స్పష్టం చేశారు. ఈ ఆధారాల మేరకు కేసును కొట్టేశారు.

Follow us on , &

ఇవీ చదవండి