Breaking News

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ఆఫీస్‌ – టెక్‌, సృజనాత్మక రంగాలకు బిగ్‌ బూస్ట్‌

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ కొత్త ఆఫీస్‌ – టెక్‌, సృజనాత్మక రంగాలకు బిగ్‌ బూస్ట్‌


Published on: 06 Nov 2025 17:10  IST

హైదరాబాద్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు, టెక్‌ కంపెనీలకు కొత్త గమ్యస్థానంగా ఎదుగుతోంది. నైపుణ్యం కలిగిన యువత, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలు, వ్యాపార అనుకూల వాతావరణం వంటివి భాగ్యనగరాన్ని గ్లోబల్‌ సంస్థల కేంద్రంగా మారుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అమెరికాకు చెందిన ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) కూడా హైదరాబాద్‌ను తన కొత్త గమ్యంగా ఎంచుకుంది.

ముంబైలో ఇప్పటికే ఉన్న ఆఫీస్‌ తర్వాత, కంపెనీ భారతదేశంలో రెండవ కార్యాలయాన్ని హైటెక్‌ సిటీలో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త సెంటర్‌ ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌ కార్యకలాపాలకు బ్యాక్‌ఎండ్‌ సపోర్ట్‌ హబ్‌గా పనిచేయనుందని తెలుస్తోంది. నగరంలోని బలమైన టెక్నాలజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ప్రతిభావంతమైన టాలెంట్‌ పూల్‌ ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆఫీస్‌ ప్రారంభంతో వందలాది ఉద్యోగ అవకాశాలు సృష్టించబడే అవకాశం ఉంది.

హైదరాబాద్‌ కేంద్రం నుంచి నెట్‌ఫ్లిక్స్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌, విఎఫ్ఎక్స్‌ (VFX), యానిమేషన్‌, రెండరింగ్‌ సేవలు నిర్వహించనుంది. ఇందుకోసం అత్యాధునిక సాంకేతికతతో కూడిన ప్రపంచ స్థాయి విఎఫ్ఎక్స్‌ స్టూడియోలు ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. అలాగే సౌండ్‌ప్రూఫ్‌ ఎడిటింగ్‌ సూట్స్‌, హై స్పీడ్‌ డేటా సర్వర్లు కూడా ఏర్పాటు చేయనుంది.

ఈ నిర్ణయం హైదరాబాద్‌ టెక్‌, క్రియేటివ్‌ రంగాల వృద్ధికి మరింత వేగం అందించనుందనే అభిప్రాయం పరిశ్రమ నిపుణులది. ఇప్పటికే గేమింగ్‌, యానిమేషన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ రంగాల్లో పలు సంస్థలు ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, నెట్‌ఫ్లిక్స్‌ రాకతో ఈ రంగాల్లో కొత్త అవకాశాలు తెరుచుకోనున్నాయి.

మొత్తం మీద, నెట్‌ఫ్లిక్స్‌ హైదరాబాద్‌లో అడుగుపెట్టడం కేవలం ఒక కంపెనీ విస్తరణ మాత్రమే కాదు — అది తెలంగాణను గ్లోబల్‌ సృజనాత్మక, టెక్‌ హబ్‌గా నిలబెట్టే కీలక అడుగు అని చెప్పొచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి