Breaking News

హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ దాడులు: పలు ప్రముఖ హోటల్ యజమానుల ఇళ్లలో సోదాలు

హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ దాడులు: పలు ప్రముఖ హోటల్ యజమానుల ఇళ్లలో సోదాలు


Published on: 18 Nov 2025 10:24  IST

హైదరాబాద్ నగరంలో మరోసారి ఆదాయపన్ను శాఖ సోదాలు కలకలం రేపుతున్నాయి. నగరంలో ప్రముఖంగా పేరుగాంచిన పిస్తా హౌస్, షాగౌస్, మేహిఫెల్ వంటి హోటల్‌ చైన్లకు సంబంధించిన చైర్మన్‌లు, డైరెక్టర్లు, ముఖ్య నిర్వాహకుల నివాసాలు, కార్యాలయాల్లో భారీగా ఐటీ దాడులు జరుగుతున్నాయి.

తెలిసిన వివరాల ప్రకారం, నగరంలో సుమారు 30 చోట్ల ఒకేసారి ఇన్కమ్ టాక్స్ అధికారులు తనిఖీలు ప్రారంభించారు. ప్రతి సంవత్సరం పెద్దమొత్తంలో వ్యాపారం చేస్తున్న ఈ హోటల్‌ గ్రూపుల ఆర్థిక లావాదేవీలపై అనుమానాలు వ్యక్తమవడంతోనే ఈ సోదాలు జరుగుతున్నట్టు సమాచారం.

రాజేంద్రనగర్‌లోని పిస్తా హౌస్ యజమానులు మోహమ్మద్ మజీద్, మోహమ్మద్ ముస్తాన్ నివాసాల్లో నాలుగు ప్రత్యేక బృందాలు గట్టి తనిఖీలు కొనసాగిస్తున్నాయి. రికార్డుల్లో చూపిన ఆదాయం, వాస్తవానికి వచ్చిన ఆదాయంతో సరిపోలడం లేదని ప్రాథమిక పరిశీలనలో అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. అలాగే హవాలా, నకిలీ లావాదేవీలు, అనుమానాస్పద ట్రాన్సాక్షన్లు ఉన్నాయనే ఆరోపణలపై కూడా దృష్టి సారించారు.

ఇదే క్రమంలో హోటల్ సిబ్బందికి ఇచ్చిన వసతి గృహాల్లో, అలాగే కొంతమంది వర్కర్ల ఇళ్లలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, అకౌంటింగ్ ఫైళ్లను పరిశీలిస్తూ డిజిటల్ డేటాను సేకరిస్తున్నారు.

సోదాలు పూర్తయ్యాక మొత్తం విషయంపై స్పష్టమైన వివరాలు అధికారులే వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం హోటల్ రంగంలో జరుగుతున్న ఈ ఐటీ దూకుడు నగర వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి