Breaking News

పాన్‌కార్డులో తప్పులతో పాస్‌పోర్టు రిజెక్ట్ అయ్యిందా.. పన్ను శాఖ ఇచ్చిన పరిష్కారం ఇదే..

పాన్‌కార్డులో తప్పులతో పాస్‌పోర్టు రిజెక్ట్ అయ్యిందా.. పన్ను శాఖ ఇచ్చిన పరిష్కారం ఇదే..


Published on: 21 Nov 2025 18:36  IST

పాన్ కార్డు మన రోజువారీ అధికారిక పనుల్లో ఎంతో ముఖ్యమైన పత్రం. బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయటం, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయటం, పెట్టుబడులు పెట్టటం, వ్యాపారాలు నమోదు చేసుకోవటం వంటి ప్రతి ముఖ్యమైన ప్రక్రియలో పాన్ తప్పనిసరి. అయితే పాన్ కార్డులో పేర్లు, జన్మతేదీ లేదా తండ్రి పేరు వంటి వివరాల్లో ఏదైనా పొరపాటు ఉంటే అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. చాలామందికి ఈ తప్పులను ఎలా సరిచేయాలో తెలియక సమస్యలు మరింత పెరిగిపోతుంటాయి.

ఇటీవల ఇలాంటి సమస్యకు సంబంధించిన ఒక ట్వీట్ వైరల్ అయ్యింది. ఒక వ్యక్తి తన తండ్రి పాన్ కార్డులో ఇంటిపేరులో చిన్న పొరపాటు ఉండటంతో పాస్‌పోర్ట్‌ దరఖాస్తు ఆలస్యమైందని, ఆ తప్పును ఎలా సవరించుకోవాలో ఆదాయపు పన్ను శాఖను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశ్నించాడు.

ఈ ట్వీట్‌కు వెంటనే స్పందించిన ఇన్‌కమ్ ట్యాక్స్‌ శాఖ, పాన్‌లోని వివరాలు మార్చుకునేందుకు అవసరమైన అధికారిక ప్రక్రియను స్పష్టంగా వివరించింది. పాన్ కార్డు వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాలంటే, NSDL లేదా UTIITSL పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో అప్డేట్‌ రిక్వెస్ట్‌ పంపాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయడంతో పాటు, సరైన సర్దుబాటు ఫీజును చెల్లిస్తే వివరాలు సరిచేయబడతాయని తెలిపింది.

పాన్ కార్డులో చిన్న తప్పిదం కూడా భద్రతా పత్రాలు, బ్యాంక్ ప్రక్రియలు, పాస్‌పోర్ట్ దరఖాస్తులు వంటి కీలక విషయాల్లో ఆటంకాలు కలిగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే పాన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఇచ్చే వివరాలను రెండుమార్లు జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ ఘటనతోపాటు, పాన్ కార్డు లోపాలను ఎలా సవరించుకోవాలో ప్రజల్లో అవగాహన పెరిగింది. ముఖ్యంగా అధికారిక ట్వీట్‌ ద్వారా ఇచ్చిన సమాచారం చాలా మందికి మార్గదర్శకంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి