Breaking News

ఔటర్ రింగ్ రోడ్ వరకూ జీహెచ్‌ఎంసీ విస్తరణకు కేబినెట్ ఆమోదం

ఔటర్ రింగ్ రోడ్ వరకూ జీహెచ్‌ఎంసీ విస్తరణకు కేబినెట్ ఆమోదం


Published on: 26 Nov 2025 10:12  IST

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని మరింత విస్తరించే కీలక నిర్ణయానికి రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపై ఔటర్ రింగ్ రోడ్ (ORR)నే జీహెచ్‌ఎంసీ సరిహద్దుగా నిర్ణయించనుంది. ఈ నిర్ణయంతో హైదరాబాద్ నగరం దేశంలోనే అతి పెద్ద నగరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న 20 మునిసిపాలిటీలు, 7 కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ చట్టం, తెలంగాణ మున్సిపాలిటీ చట్టాల్లో మార్పులు చేయడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

ఈ విలీన ప్రక్రియలో అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రస్తుతం 150 డివిజన్లతో ఉన్న జీహెచ్‌ఎంసీ, ఈ మార్పులతో మూడింతలు విస్తరించే అవకాశం ఉంది. నగర విస్తీర్ణం సుమారు 2,735 చదరపు కిలోమీటర్లు ఉండగా, జనాభా దాదాపు 2 కోట్లకు చేరనుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

విలీనంపై జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ అంగీకారం

27 మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో కలపాలనే ప్రభుత్వ ప్రతిపాదనపై అధ్యయనం చేసి అభిప్రాయం చెప్పేందుకు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ అంగీకారం తెలిపింది. ఈ ప్రతిపాదనను జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కౌన్సిల్ సమావేశంలో ఉంచగా, మెజారిటీ సభ్యులు మద్దతు పలికారు.

ఎంఐఎం పార్టీ కొంత అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయంపై కాదని, కేవలం అధ్యయన నివేదిక ఇవ్వడానికే అంగీకరిస్తున్నామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ పాలక మండలి కాలపరిమితి పూర్తయ్యాకే అధికారిక విలీనం అమల్లోకి వస్తుందని అధికారులు తెలియజేశారు.

సమగ్ర అభివృద్ధే ప్రధాన లక్ష్యం

జీహెచ్‌ఎంసీలో కలవబోయే శంషాబాద్, నార్సింగి, మేడ్చల్ వంటి ప్రాంతాలు ఇప్పటికే ఓఆర్‌ఆర్ గ్రోత్ కారిడార్‌లో ఉండడంతో వేగంగా పట్టణీకరణ చెందుతున్నాయి. అయితే, ఈ ప్రాంతాలు వేర్వేరు మునిసిపాలిటీల కింద ఉండటంతో అభివృద్ధి పనులు ఒకే విధంగా జరగడం లేదు.

ఈ అసమతౌల్యాన్ని తొలగించేందుకు ప్రభుత్వం ఒకే నగర ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించింది. అన్ని ప్రాంతాల్లో సమానంగా మౌలిక సదుపాయాలు అందించడం, అస్తవ్యస్త కాలనీల ఏర్పాటును నియంత్రించడం, జనాభా ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవడం, విపత్తుల నిర్వహణను సులభతరం చేయడం ఈ విలీన నిర్ణయ ప్రధాన ఉద్దేశాలు.

ఉద్యోగులు, ప్రజలకు ఒకే విధమైన సౌకర్యాలు

జీహెచ్‌ఎంసీ పరిధి పెరగడంతో ఓఆర్‌ఆర్ అవతల ప్రాంతాలకు కూడా హైదరాబాద్ కేంద్రానికి సమానమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం వాటర్‌బోర్డు సేవలు పరిమితంగా ఉన్న ప్రాంతాలకు తాగునీటి సరఫరా మెరుగుపడనుంది.

విలీనం కానున్న 27 మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు జీహెచ్‌ఎంసీ ఉద్యోగులుగా మారనున్నారు. వారికి జీతభత్యాలు, వేతన విధానం కూడా జీహెచ్‌ఎంసీ ఉద్యోగుల్లాగానే అమలవుతుంది. మునిసిపాలిటీ కార్యాలయాలు జోనల్ లేదా సర్కిల్ కార్యాలయాలుగా మారనున్నాయి. పన్నుల విధానం కూడా నగర వ్యాప్తంగా ఒకేలా ఉంటుంది.

‘మినీ తెలంగాణ’గా మారనున్న జీహెచ్‌ఎంసీ

విస్తరణ తర్వాత జీహెచ్‌ఎంసీ పరిధిలో రాష్ట్ర జనాభాలో దాదాపు సగం మంది నివసించే పరిస్థితి ఏర్పడనుంది. ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్లుగా ఉన్న నగర విస్తీర్ణం, 2,735 చదరపు కిలోమీటర్లకు పెరగనుంది. జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్ కూడా రూ.8 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనాలు చెబుతున్నాయి.

హెచ్‌ఎండీఏ ఆదాయంపై ప్రభావం

జీహెచ్‌ఎంసీ విస్తరణతో హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు హెచ్‌ఎండీఏ ఆదాయంలో ఎక్కువ భాగం ఓఆర్‌ఆర్ గ్రోత్ కారిడార్ నుంచే వస్తోంది. కానీ ఆ కీలక ప్రాంతాలు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి రావడంతో, హెచ్‌ఎండీఏ ఆదాయం తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి