Breaking News

డిజిటల్ మహానగరంగా విశాఖ: డేటా సెంటర్లకు కొత్త చిరునామా

డిజిటల్ మహానగరంగా విశాఖ: డేటా సెంటర్లకు కొత్త చిరునామా


Published on: 27 Nov 2025 10:39  IST

రాబోయే మూడు నుంచి నాలుగేళ్లలో విశాఖపట్నం దేశంలోనే కీలకమైన డేటా సెంటర్ హబ్‌గా రూపాంతరం చెందనుంది. ప్రపంచ స్థాయి టెక్ సంస్థలు వరుసగా విశాఖపై దృష్టి పెట్టడంతో నగరం డిజిటల్ రంగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది. ఆధునిక మౌలిక సదుపాయాలు, సముద్రతీరం సమీపం, స్థిరమైన విద్యుత్ సరఫరా వంటి అంశాలు విశాఖను డేటా సెంటర్లకు అనుకూల కేంద్రంగా మార్చుతున్నాయి.

ఈ దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కీలక అడుగు వేసింది. డిజిటల్ కనెక్టివిటీ రంగంలోని అనుబంధ సంస్థతో కలిసి భారీ పెట్టుబడితో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తోంది. దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్ నిర్మించేందుకు ప్రభుత్వం తో ఒప్పందం కుదిరింది. దాదాపు రూ.98 వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్‌ను 2030 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నారు.

విశాఖలో ఏఐ మౌలిక వసతులకు బలమైన పునాది

రిలయన్స్ ఏర్పాటు చేయనున్న ఈ డేటా సెంటర్ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఇప్పటికే పనిచేస్తున్న భారీ డేటా సెంటర్‌కు అనుబంధంగా పని చేయనుంది. మాడ్యులర్ టెక్నాలజీ ఆధారంగా గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్లు, టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఆధునిక ఏఐ చిప్‌లతో డేటా నిల్వ, విశ్లేషణకు ఇది ఉపయోగపడనుంది. వివిధ రంగాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంస్థలు కోరుకునే విధంగా ఈ కేంద్రాన్ని అనుకూలంగా రూపొందించనున్నారు.

భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ప్రత్యేక సబ్‌స్టేషన్లు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయనున్నారు. ఆసియా ఖండంలో అత్యంత శక్తివంతమైన ఏఐ మౌలిక వసతులు కలిగిన నెట్‌వర్క్‌లలో ఇది ఒకటిగా ఉండబోతుందన్న అంచనాను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

అంతర్జాతీయ దిగ్గజాల పెట్టుబడులు వెల్లువ

విశాఖపై పెట్టుబడుల ప్రవాహం ఇది ఒక్క రిలయన్స్‌తోనే ఆగలేదు. ఇప్పటికే గూగుల్ సంస్థ రూ.1.33 లక్షల కోట్ల వ్యయంతో వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అలాగే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం బ్రూక్‌ఫీల్డ్ కూడా రూ.1.10 లక్షల కోట్ల పెట్టుబడితో విశాఖలో తమ డేటా సెంటర్ ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. దేశీయ సంస్థ సిఫీ టెక్నాలజీస్ రూ.16 వేల కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఇప్పటికే భూమిపూజ కూడా నిర్వహించింది.

ప్రభుత్వ లక్ష్యంలో సగం చేరుకున్న విశాఖ

విశాఖలో మొత్తం 6,000 మెగావాట్ల సామర్థ్యం గల డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. వీటిని 2030 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే గూగుల్, రిలయన్స్, బ్రూక్‌ఫీల్డ్ వంటి సంస్థల ద్వారా సుమారు 3,000 మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టులు ఖరారవడం విశేషం.

మరో మూడు అంతర్జాతీయ సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయి. అవసరమైన భూములు, మౌలిక వసతులపై ప్రభుత్వ అధికారులు వారితో చర్చలు జరుపుతున్నారు. వచ్చే మూడు నెలల లోపే ఈ కొత్త ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

డిజిటల్ ఎకానమీకి విశాఖ కేంద్రబిందువు

ఈ భారీ పెట్టుబడులతో విశాఖపట్నం కేవలం పారిశ్రామిక నగరంగానే కాక, దేశ డిజిటల్ ఎకానమీకి కీలక కేంద్రంగా మారే దిశగా ముందడుగు వేస్తోంది. వేలాది ఉద్యోగ అవకాశాలు, అనుబంధ రంగాల అభివృద్ధితో పాటు, ఏఐ మరియు డేటా టెక్నాలజీల్లో భారతదేశ స్థాయిని పెంచే నగరంగా విశాఖ నిలవబోతుందని నిపుణులు భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి