Breaking News

విత్ డ్రా చేసుకో అన్నప్లీజ్.. సర్పంచ్, వార్డు అభ్యర్థులకు బుజ్జగింపులు

విత్ డ్రా చేసుకో అన్నప్లీజ్.. సర్పంచ్, వార్డు అభ్యర్థులకు బుజ్జగింపులు


Published on: 02 Dec 2025 09:59  IST

గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి దశ ప్రక్రియ కీలక దశకు చేరింది. సర్పంచ్‌ మరియు వార్డు మెంబర్ల ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో నామినేషన్ల స్వీకరణ, స్క్రూట్నీ పూర్తవడంతో పోటీలో ఎవరు నిలిచారనేది స్పష్టమైంది. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం వరకు గడువు ఉండడంతో, ఒక్కో స్థానానికి ఒక్క అభ్యర్థే మిగలేలా రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

ప్రత్యర్థులను పోటీ నుంచి తప్పించే ఉద్దేశంతో ఆయా పార్టీల నాయకులు, సన్నిహితులు రంగంలోకి దిగుతున్నారు. పరస్పర సహకార ఒప్పందాలు చేసుకుంటూ – “ఈసారి సర్పంచ్‌కి నాకు మద్దతిస్తే, వచ్చే ఎంపీటీసీ ఎన్నికల్లో నీకు సహకరిస్తా” అనే రకమైన ఒప్పందాలు సాగుతున్నట్లు సమాచారం. సర్పంచ్ పదవులతో పాటు వార్డు మెంబర్ స్థానాలకు బరిలో ఉన్న అభ్యర్థుల మధ్య కూడా ఇదే తరహా వ్యూహాలు సాగుతున్నాయి.

ఓట్ల చీలిక తప్పించేందుకు కుల పెద్దల జోక్యం

రిజర్వేషన్ విధానం కారణంగా కొన్ని గ్రామాల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు, ముగ్గురు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. దీంతో తమ కులం ఓట్లు విడిపోయి ప్రత్యర్థులకు లాభం చేకూరుతుందనే ఆందోళనతో ఆయా కులాల పెద్దలు రంగంలోకి దిగుతున్నారు. అందరిలో ఒకరిని మాత్రమే బరిలో ఉంచి మిగిలినవారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే, రిజర్వేషన్ మళ్లీ తమకు ఎప్పుడొస్తుందో తెలియదు అనే భావనతో పలువురు ఆశావహులు వెనక్కి తగ్గడం లేదు. కొందరు అయితే ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు చెప్పినా వినకుండా బరిలో కొనసాగుతున్నారు. సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి ఆధిక్యం ఉంటుందనే భావనతో ఈసారి కాంగ్రెస్ నాయకుల నుంచే ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది.

బుజ్జగింపులు, బేరసారాలు జోరుగా

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల నాయకులు పలు గ్రామాల్లో సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నించారు. అయితే ఉమ్మడి జిల్లాలో రెండు మూడు గ్రామాలను మినహాయించి, మిగిలిన చోట్ల ఈ ప్రయత్నాలు ఫలించలేదనే చెప్పాలి. చాలా గ్రామాల్లో సర్పంచ్ స్థానానికి మూడు నుంచి పది వరకు నామినేషన్లు దాఖలవడం, అదే పార్టీకి చెందిన ఇద్దరు ముగ్గురు బరిలో ఉండడం ఆయా పార్టీలకు తలనొప్పిగా మారింది.

పోటీ కాస్త తక్కువగా ఉన్న చోట్ల మాత్రం ఒకరినే అభ్యర్థిగా నిలబెట్టి, మిగిలిన వారిని ఒప్పించి ఉపసంహరణ చేయించాలని నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం భారీ స్థాయిలో బేరసారాలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది.

డబ్బు, పదవుల హామీలతో ఉపసంహరణ ప్రయత్నాలు

పోటీ నుంచి తప్పుకునే అభ్యర్థులకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు కొన్ని చోట్ల చర్చ జరుగుతోంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఇతర పదవులు ఇస్తామనే హామీలు, వచ్చే ఎంపీటీసీ లేదా జడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్ మీకే అనుకూలంగా ఉంటే పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తామనే మాటలు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఖర్చులు కూడా చూసుకుంటామని ముందే భరోసా ఇస్తున్నారు.

ఇంకొన్ని చోట్ల గ్రామీణాభివృద్ధి పనుల పేరుతో రూ.5 లక్షలు లేదా రూ.10 లక్షల విలువైన పనులను అప్పగిస్తామని చెప్పి రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

ఉపసంహరణకు ఒత్తిళ్లు.. బెదిరింపుల కేసు వెలుగులోకి

కొన్ని చోట్ల ఈ బేరసారాలు బెదిరింపుల దాకా వెళ్లిన ఘటనలు కూడా బయటకు వస్తున్నాయి. గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో ఒక వార్డు మెంబర్ అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని కొందరు బెదిరించిన ఘటన అధికారుల దృష్టికి వెళ్లింది. ఈ విషయంపై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అధికారులు సోమవారం గ్రామంలో విచారణ చేపట్టారు.

సదరు వార్డులో గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థిని ఏకగ్రీవం చేయాలని ముందుగా ప్రయత్నించారు. అయితే మరో వ్యక్తి పోటీ చేస్తానని రావడంతో గ్రామ పెద్దలు మధ్యవర్తిత్వం చేసి అతడికి రూ.50 వేల వరకు ఇచ్చి పోటీ నుంచి తప్పించాలని ప్రయత్నించినట్లు తెలిసింది. ఆ డబ్బును ముందుగా ఒక పెద్దమనిషి వద్ద ఉంచారు.

కానీ సదరు వ్యక్తి నామినేషన్ దాఖలు చేయడంతో, అతడిపై గతంలో ఓడిన అభ్యర్థి మరియు కొందరు పెద్దలు ఒత్తిళ్లు, బెదిరింపులకు దిగినట్లు సమాచారం. దీంతో బాధితుడు పోలీసులకే కాకుండా ఎన్నికల అధికారులకు కూడా ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి