Breaking News

స్టీల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ పనులు రెండు నెలల్లో షురూ.. కేబీఆర్ పార్కు చుట్టూ రూ.1,090 కోట్లతో వర్క్స్

స్టీల్ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ పనులు రెండు నెలల్లో షురూ.. కేబీఆర్ పార్కు చుట్టూ రూ.1,090 కోట్లతో వర్క్స్


Published on: 02 Dec 2025 10:17  IST

హైదరాబాద్ నగర రవాణా సమస్యలకు పరిష్కారంగా చేపట్టిన ‘హెచ్‌ సిటీ’ అభివృద్ధి పనులకు కొత్త ఊపొచ్చింది. మొత్తం రూ.7,038 కోట్ల వ్యయంతో ఐదు ప్యాకేజీల కింద 23 ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టులను జీహెచ్ఎంసీ అమలు చేస్తోంది. తాజాగా ఈ పనులను మరింత వేగంగా పూర్తి చేయాలనే దిశగా అధికార యంత్రాంగం కదిలింది.

ఈ ప్రాజెక్టుల్లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ భారాన్ని తగ్గించేందుకు ఆరు స్టీల్ ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. వీటికి సుమారు రూ.1,090 కోట్ల వ్యయం అంచనా వేశారు. వీటిలో సివిల్ పనులు, యుటిలిటీల మార్పిడి పనుల కోసం రెండు ప్యాకేజీల కింద దాదాపు రూ.930 కోట్లతో పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తవ్వగా, ఈ పనులు ఒక ప్రముఖ నిర్మాణ సంస్థకు దక్కాయి.

వివాదాలు లేని చోట ముందుగా పనులు

స్థల సేకరణకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కోర్టు వివాదాలు కొనసాగుతున్నా, అలాంటి సమస్యలు లేని ప్రాంతాల్లో ముందుగా నిర్మాణ పనులు ప్రారంభించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు పనులు త్వరలోనే బల్దియా నేరుగా పర్యవేక్షణలోకి రానున్నాయి.

పనుల ప్రారంభానికి ముందు ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్‌, టెలిఫోన్ శాఖల అధికారులతో జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే సమన్వయ సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం భూసార పరీక్షలు, జీపీఆర్ (గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్) సర్వేలు కొనసాగుతున్నాయి. ఈ రోడ్డు అభివృద్ధి పనులన్నీ రెండేళ్లలో పూర్తిచేయాలనే లక్ష్యాన్ని అధికారులు నిర్ధారించారు.

ఒక్కొక్క ప్రాజెక్టు వివరాలు ఇదే

ఫ్లైఓవర్‌ ప్రాజెక్టుల కింద మొత్తం ఏడు ప్రధాన ఫ్లైఓవర్లు నిర్మించనుండగా, వీటికి వందకు పైగా పిల్లర్లు అవసరమవుతాయని అంచనా. అమీన్‌పూర్ రోడ్డుకు సంబంధించి రోడ్డు అభివృద్ధి పనులను శివ సత్య ఏజెన్సీ చేపట్టనుంది. కూకట్‌పల్లి వై జంక్షన్ నుంచి ఒక వైపు మియాపూర్, మరోవైపు అమీరపేట దిశల్లో ఏర్పాటుచేయనున్న ఫ్లైఓవర్ సివిల్ పనులను కేఎన్ఆర్ సంస్థ నిర్వహించనుంది. దీనికి సుమారు రూ.112 కోట్ల మేర వ్యయం కానుండగా, ఇందులో స్థల సేకరణ ఖర్చులు మినహాయించినట్లు అధికారులు తెలిపారు.

మరో నెలలో పూర్తిస్థాయి పనులు

ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ ప్రాజెక్టులు మరో నెల రోజుల్లో పూర్తిస్థాయిలో ఫీల్డ్ లెవెల్‌లో పనులకు ఊపందుకోనున్నాయి. అలాగే ఆర్కేపురం, శేరిలింగంపల్లిలో నిర్మించనున్న రెండు ఆర్వోబీలకు (రోడ్ ఓవర్ బ్రిడ్జ్‌లు) ఇప్పటికే రైల్వే శాఖ నుంచి అనుమతులు లభించాయి. దీంతో సంబంధిత టెండర్ల ప్రక్రియను ప్రారంభించేందుకు జీహెచ్ఎంసీ ఇంజినీర్లు సిద్ధమవుతున్నారు.

ఇంకా టెండర్లు పూర్తికాని హెచ్ సిటీ ప్రాజెక్టులన్నింటికీ ఈ నెల 7వ తేదీ లోపు టెండర్ల ప్రక్రియను ముగించాలనే లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టులు పూర్తయితే నగరంలోని పశ్చిమ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి