Breaking News

హోమ్ లోన్.. కార్ లోన్ EMI కట్టేవాళ్లకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన RBI..

హోమ్ లోన్.. కార్ లోన్ EMI కట్టేవాళ్లకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గించిన RBI..


Published on: 05 Dec 2025 18:13  IST

అంచనాల ప్రకారమే భారత రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) డిసెంబర్ మానిటరీ పాలసీ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ కీలక వడ్డీ రేట్లలో కోత పెట్టింది. ఈ నిర్ణయంతో రెపో రేటు గతంలో ఉన్న 5.50 శాతం నుంచి 5.25 శాతానికి తగ్గింది. మూడు రోజులపాటు సాగిన పాలసీ సమావేశాల అనంతరం ఈ నిర్ణయాన్ని ఆర్‌బీఐ ప్రకటించింది.

దేశంలో ప్రస్తుతం ద్రవ్యోల్బణం చాలా తక్కువ స్థాయిలో కొనసాగుతుండటం ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండగా, మరోవైపు రూపాయి మారకపు విలువ కూడా గణనీయంగా పడిపోవడం ఆర్‌బీఐపై ఒత్తిడిని పెంచింది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా వడ్డీ రేట్లను తగ్గించాలన్న దిశగా కేంద్ర బ్యాంక్ అడుగులు వేసింది.

ఇంతకుముందు జూన్‌లో జరిగిన పాలసీ సమావేశంలో ఆర్‌బీఐ రెపో రేటును 6 శాతం నుంచి 5.5 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్య పరిమితుల్లోనే కొనసాగడంతో మరోసారి వడ్డీ రేట్ల కోతకు అవకాశం ఏర్పడింది. ప్రజలకు నేరుగా లాభం చేకూరాలన్న ఉద్దేశంతోనే తాజా తగ్గింపునకు ఆర్‌బీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

రెపో రేటు తగ్గింపు ప్రభావంతో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ముఖ్యంగా హోమ్ లోన్లు, కార్ లోన్లు మరియు ఇతర రిటైల్ రుణాలు తీసుకున్న వారికి ఇది స్వల్ప ఊరటనిచ్చే నిర్ణయంగా మారనుంది. ఈఎంఐ భారం కొంత తగ్గడం వల్ల వినియోగ ఖర్చులు పెరిగి, ఆర్థిక వ్యవస్థకు ఊపొస్తుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి