Breaking News

మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 48గంటల్లోనే అకౌంట్‌లో రూ.8లక్షలు..

మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. 48గంటల్లోనే అకౌంట్‌లో రూ.8లక్షలు..


Published on: 08 Dec 2025 10:39  IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం మరో ముఖ్యమైన అడుగు వేసింది. మహిళలకు స్థిరమైన ఆదాయం వచ్చేలా చేయడం, స్వయం ఉపాధి అవకాశాలను పెంచడం కోసం తక్కువ వడ్డీ రుణాలు, సబ్సిడీ ఆధారిత పథకాలను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే అమలులో ఉన్న స్త్రీనిధి పథకాన్ని మరింత విస్తరించడంతో పాటు, దానికి అనుసంధానంగా రెండు కొత్త పథకాలను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ కొత్త కార్యక్రమాల ద్వారా స్వయం సహాయక సంఘాల్లో (డ్వాక్రా గ్రూపులు) సభ్యులుగా ఉన్న మహిళలకు విస్తృతంగా ఆర్థిక సహాయం అందించనున్నారు. ఒక్కో మహిళకు కనీసం లక్ష రూపాయల నుంచి అవసరాన్ని బట్టి గరిష్టంగా 8 లక్షల రూపాయల వరకు రుణాలు అందించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ రుణాలు చిన్న వ్యాపారాలు, ఉపాధి కార్యక్రమాలు ప్రారంభించేందుకు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

48 గంటల్లోనే ఖాతాలో నగదు జమ..
స్త్రీనిధి పథకం ప్రత్యేకత ఏమిటంటే, రుణాల మంజూరు ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది. అర్హత సాధించిన మహిళలకు రుణం ఆమోదం పొందిన 48 గంటల్లోనే బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసేలా వ్యవస్థను రూపొందించారు. మహిళలు జీవనోపాధి కోసం 8 లక్షల రూపాయల వరకు, కుటుంబ అవసరాల కోసం లక్ష రూపాయల వరకు రుణాలు పొందవచ్చు. అంతేకాదు, రుణగ్రహీత అనుకోకుండా మరణిస్తే కుటుంబంపై భారం పడకుండా ‘స్త్రీనిధి సురక్ష’ పథకం కింద ఆ రుణాన్ని మాఫీ చేసే వెసులుబాటు కూడా ఉంది.

విద్య, వివాహాలకు ప్రత్యేక సహాయం..
పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు మరింత భరోసా కల్పించే ఉద్దేశంతో ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, కళ్యాణలక్ష్మి పథకాలను కూడా ప్రభుత్వం అమలుకు సిద్ధం చేస్తోంది. ఈ పథకాల ద్వారా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళల పిల్లలకు ఉన్నత విద్య కోసం, అలాగే వారి వివాహ ఖర్చుల కోసం ఆర్థిక సహాయం అందనుంది. దీంతో కుటుంబ ఆర్థిక ఒత్తిడి తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

గ్రేడ్‌ల ఆధారంగా రుణాల మంజూరు..
స్వయం సహాయక సంఘాల పనితీరు, ఆర్థిక నిర్వహణను బట్టి వాటిని A, B, C, D గ్రేడ్లుగా విభజించి రుణ పరిమితులు నిర్ణయిస్తున్నారు. అత్యుత్తమ పనితీరు చూపిన A గ్రేడ్ సంఘాలకు కోటి రూపాయల వరకూ రుణ సౌకర్యం ఉంటుంది. బి గ్రేడ్ సంఘాలకు 90 లక్షలు, సి గ్రేడ్ సంఘాలకు 80 లక్షలు, డి గ్రేడ్ సంఘాలకు 70 లక్షల వరకూ రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఈ విధానం ద్వారా సంఘాల మధ్య పోటీ పెరిగి, సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి