Breaking News

రెండ్రోజుల్లో నిజం తేలుతుంది” – పశ్చిమాసియాలో ఉద్రిక్తత

రెండ్రోజుల్లో నిజం తేలుతుంది” – పశ్చిమాసియాలో ఉద్రిక్తత


Published on: 02 Feb 2026 10:29  IST

అమెరికా తమపై దాడి చేస్తే పశ్చిమాసియా మొత్తం యుద్ధ మంటల్లో చిక్కుకుంటుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇటీవల తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఖమేనీ చేసిన హెచ్చరికలు నిజమవుతాయా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఇంకొద్దిరోజులు వేచి చూడాలని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఫ్లోరిడాలోని తన నివాసం నుంచి మీడియాతో మాట్లాడిన ట్రంప్.. అమెరికా యుద్ధాన్ని కోరుకునే దేశం కాదని స్పష్టం చేశారు. అయితే తమపై ఎవరైనా దాడికి దిగితే మాత్రం గట్టి ప్రతిస్పందన తప్పదని ఆయన హెచ్చరించారు. ఇరాన్ చుట్టుపక్కల సముద్ర ప్రాంతాల్లో అమెరికా యుద్ధ నౌకలు మోహరించి ఉన్న సమయంలో ఖమేనీ ఇంత స్పష్టంగా హెచ్చరికలు జారీ చేయడం ఇదే తొలిసారి కావడంతో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

“రెండ్రోజుల్లో ఒప్పందం కుదిరే అవకాశం”

ఈ పరిణామాలపై స్పందించిన ట్రంప్.. పశ్చిమాసియా ప్రాంతంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ నౌకలు ఉన్నాయని పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో అమెరికా–ఇరాన్ మధ్య ఏదైనా ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఒప్పందం కుదరకపోతే, ఖమేనీ చేసిన హెచ్చరికల్లో ఎంత నిజం ఉందో అప్పుడే తేలిపోతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

హార్ముజ్ జలసంధిలో ఇరాన్ సైనిక విన్యాసాలు

ఇదిలా ఉండగా, ఆదివారం మరియు సోమవారం హార్ముజ్ జలసంధిలో వ్యూహాత్మక సైనిక కసరత్తులు నిర్వహించనున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ కీలక సముద్ర మార్గంలో జరిగే ఈ విన్యాసాలు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అయితే ఈ కసరత్తుల సమయంలో తమ యుద్ధ నౌకలు లేదా యుద్ధ విమానాలకు ముప్పు కలిగించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని అమెరికా సెంట్రల్ కమాండ్ స్పష్టంగా హెచ్చరించింది.

పెరుగుతున్న ఉద్రిక్తతలు

ఇరు దేశాల అగ్ర నేతల వరుస వ్యాఖ్యలు, సైనిక కదలికల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కారమవుతుందా? లేక ప్రాంతీయ యుద్ధానికి దారితీస్తుందా? అన్న అంశంపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

Follow us on , &

ఇవీ చదవండి