Breaking News

ట్రంప్, మస్క్ మధ్య కయ్యం.. పరిణామాలు తీవ్రంగా ఉంటయ్.. మస్క్కు ట్రంప్ వార్నింగ్

డెమోక్రాట్లకు నిధులు సమకూరిస్తే బాగుండదని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్​ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.


Published on: 09 Jun 2025 08:00  IST

అమెరికా రాజకీయాల్లో వేడి రాజేస్తున్న అంశం - టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌కి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి మధ్య పెరుగుతున్న వైరం. తాజాగా ఒక టీవీ ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

డెమోక్రాటిక్ పార్టీకి మద్దతుగా ఎలాన్ మస్క్ నిధులు సమకూరుస్తున్నారన్న వార్తలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. "అలా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మస్క్‌తో నాకు ఇకపై ఎలాంటి సంబంధాలు అవసరం లేదు. ప్రభుత్వానికి సంబంధించిన స్పేస్ ఎక్స్ ఒప్పందాలను కూడా మళ్లీ పరిశీలిస్తున్నాం" అంటూ స్పష్టం చేశారు.

ట్రంప్ తీసుకువచ్చే 'బిగ్ బ్యూటిఫుల్ బిల్' (వ్యయ బిల్లు)పై మస్క్ ప్రజల సమక్షంలో వ్యతిరేకత వ్యక్తం చేయడం, రిపబ్లికన్లపై విమర్శలు చేయడం, పార్టీకి విరుద్ధంగా వ్యవహరించడం వంటివి ఈ వివాదానికి ఆవిరిగా మారాయి. మస్క్ డెమోక్రాట్లకు ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసిందని, అలాంటి పరిణామాలకి తానే తలొగ్గనని ట్రంప్ హెచ్చరించారు. "ఎలాన్ మస్క్ డెమోక్రాట్లకు డబ్బులు ఇస్తే ఆ తర్వాత ఆయన ఇబ్బందులు తప్పవు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఇంతకుముందు మంచి సంబంధాలు ఉన్నట్టు అనిపించిన ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు సంబంధాలు పూర్తిగా చెడిపోయినట్టు స్పష్టమవుతోంది. మస్క్‌పై నేరుగా చర్యలు తీసుకుంటారా? అన్నదానిపై మాత్రం ట్రంప్ స్పష్టత ఇవ్వలేదు. కానీ, ప్రభుత్వ స్థాయి ఒప్పందాల పునఃపరిశీలన కొనసాగుతోందని చెప్పారు.

మస్క్ కౌంటర్: ట్రంప్‌ను పదవి నుంచి తొలగించాలి!

ట్రంప్ చేసిన విమర్శలపై ఎలాన్ మస్క్ కూడా నిశ్శబ్దంగా ఉండలేదు. సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. ట్రంప్‌ పై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ, ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాక, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యల అనంతరం కొన్ని పోస్టులను మస్క్ తొలగించినా, ఆయన అసంతృప్తి మాత్రం స్పష్టంగా బయటపడింది. రాజకీయాల్లో ప్రవేశించకపోయినా, మస్క్ ప్రభావం మాత్రం పెరుగుతూనే ఉంది. ఇటువంటి ప్రకటనల నేపథ్యంలో అమెరికా రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి