Breaking News

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకుల్లో 1007 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకుల్లో 1007 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్


Published on: 04 Jul 2025 18:34  IST

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) మరోసారి భారీ సంఖ్యలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మొత్తం 1,007 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు. సాధారణంగా బ్యాంకులలో అన్ని పనులు ప్రొబేషన్‌రీ ఆఫీసర్ల ద్వారానే నిర్వహించేవారు. కానీ ఇప్పుడు ప్రత్యేక విభాగాల నిర్వహణకు ప్రొఫెషనల్ నైపుణ్యం ఉన్న వ్యక్తులను ఎంపిక చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక పరీక్ష విధానాన్ని కూడా అమలుచేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఐటీ ఆఫీసర్ పోస్టులకు 203, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులకు 310, రాజ్యభాషా అధికారి 78, లా ఆఫీసర్ 56, హెచ్ఆర్/పర్సనల్ ఆఫీసర్ 10, మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు 350 ఖాళీలు ఉన్నాయి. ప్రతి పోస్టుకు ప్రత్యేక అర్హతలు ఉండగా, అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

ఉదాహరణకు, ఐటీ ఆఫీసర్ పదవికి కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్సుల్లో ఇంజినీరింగ్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారే అర్హులు. అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టుకు వ్యవసాయం, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్ వంటి అంశాల్లో నాలుగేళ్ల డిగ్రీ అవసరం. లా ఆఫీసర్ పోస్టుకు ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి బార్ కౌన్సిల్‌లో నమోదు అయి ఉండాలి. అలాగే, ఇతర పోస్టులకు అనుగుణంగా సంబంధిత విద్యార్హతలు కావాలి.

వయో పరిమితి 20 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే, అభ్యర్థి 1995 జూలై 2 తర్వాత, కానీ 2005 జూలై 1కి ముందు పుట్టి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న వర్గాలకు కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

ఎంపిక ప్రక్రియలో మొదట ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఈ స్కోరు తుది మెరిట్ లిస్టులో పరిగణనలోకి రాదు. ప్రిలిమ్స్ పరీక్ష అభ్యర్థి దాఖలుచేసిన పోస్టును బట్టి వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు, లా ఆఫీసర్ మరియు రాజ్యభాష అధికారి పోస్టులకు జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, రీజనింగ్ వంటి విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. మిగిలిన పోస్టులకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కూడా కలుపుతారు. మొత్తం 150 ప్రశ్నలకు 125 మార్కులు కేటాయించి పరీక్ష నిర్వహిస్తారు. ప్రతీ తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గింపు ఉంటుంది.

ప్రిలిమ్స్‌ తర్వాత మెయిన్స్ పరీక్ష ఉంటుంది. ఇందులో అభ్యర్థుల ప్రొఫెషనల్ నాలెడ్జ్‌పై ఆధారపడిన ప్రశ్నలు ఉంటాయి. ఐటీ, లా, మార్కెటింగ్ లాంటి విభాగాల్లో 60 ప్రశ్నలకు 60 మార్కుల పరీక్ష ఉంటుంది. రాజ్యభాష అధికారికి అయితే ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రెండూ ఉంటాయి. డిస్క్రిప్టివ్‌లో ఇద్దరు ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది.

మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇది 100 మార్కుల‌కు ఉంటుంది. సాధారణ అభ్యర్థులు కనీసం 40 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల వారు 35 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలి. మెయిన్స్ మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు ప్రక్రియ జులై 1 నుంచి ప్రారంభమవుతుంది. చివరి తేదీ జులై 21గా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175 కాగా, ఇతరుల కోసం రూ.850. ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్టులో, ఫలితాలు సెప్టెంబరులో విడుదల కానున్నాయి. మెయిన్స్ పరీక్ష నవంబరులో, ఇంటర్వ్యూలు డిసెంబరు లేదా వచ్చే ఏడాది జనవరిలో జరగనుండగా, పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ www.ibps.inని సందర్శించవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి