Breaking News

దేశవ్యాప్తంగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా భారీ కార్మిక బంద్

బ్యాంకులు యధావిధి.. బస్సులు, ట్రైన్స్ కొంచెం ఆలస్యం.. బంద్ పూర్తి వివరాలు..


Published on: 09 Jul 2025 09:48  IST

దేశవ్యాప్తంగా జూలై 9న కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలకు వ్యతిరేకంగా 10 ప్రధాన కార్మిక సంఘాలు కలిసి బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెల్లో రైతులు, కార్మికులు, ఉద్యోగులు ఇలా మొత్తం 25 కోట్ల మందికి పైగా పాల్గొనడం గమనార్హం. బంద్ ప్రభావం పారిశ్రామిక రంగం, పోస్టల్ సేవలు, బీమా సంస్థలు, బ్యాంకులు, బొగ్గు గనులు, ప్రభుత్వ రవాణా, మరియు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలపై కనిపించే అవకాశం ఉంది.

కార్మిక సంఘాలు గత సంవత్సరం కేంద్రానికి 17 ప్రధాన డిమాండ్లను పెట్టినప్పటికీ ఇప్పటివరకు కేంద్రం వాటిపై స్పందించకపోవడం వల్లే ఈ సమ్మె తప్పనిసరి అయిందని అంటున్నాయి. గత పదేళ్లుగా కార్మికుల సదస్సును నిర్వహించకపోవడం, కార్మిక హక్కుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ నిరసన చేపట్టామని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

వ్యాపార నిర్వహణను సులభతరం చేయాలనే పేరుతో కార్మిక హక్కులను బలహీనపరిచేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నలుగు కార్మిక కోడ్‌లు యజమానుల‌కు అనుకూలంగా ఉండటం వలన, యూనియన్ల కార్యకలాపాలపై దెబ్బ పడుతుందని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ కొత్త చట్టాలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశాయి.

ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక విధానాల వల్ల నిరుద్యోగిత అధికమవుతోంది. నిత్యావసరాల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి. వేతనాల్లో కోతలు, ప్రభుత్వ ఖర్చుల తగ్గింపు వలన విద్య, ఆరోగ్యం, ప్రాథమిక సదుపాయాలపై ప్రభావం పడుతోంది. దీని ప్రభావం పేదలు, మధ్యతరగతి ప్రజలపై తీవ్రంగా పడుతోంది. కేంద్రం దేశ ప్రజల సంక్షేమాన్ని పక్కనపెట్టి కార్పొరేట్ లాభాల కోసం పనిచేస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ఔట్‌సోర్సింగ్ విధానాలు, కాంట్రాక్టరైజేషన్, కార్మిక శక్తిని తాత్కాలికంగా మార్చే విధానాల్ని వ్యతిరేకిస్తున్నట్లు కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి. గతంలోనూ 2020 నవంబర్ 26, 2022 మార్చి 28–29, 2023 ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా బంద్‌లు నిర్వహించిన అనుభవం కార్మిక సంఘాలకు ఉంది.

ప్రస్తుతం బంద్ ప్రభావం వివిధ రంగాల్లో కనిపిస్తోంది. సహకార బ్యాంకులు పని చేయకపోయినా, ప్రైవేట్ బ్యాంకులు యథావిధిగా సేవలందించే అవకాశముంది. పాఠశాలలు, ప్రైవేట్ కార్యాలయాలు సాధారణంగా నడవవచ్చునన్న అంచనాలు ఉన్నాయి. రవాణా సేవల్లో కొన్ని ఆటంకాలు తలెత్తే అవకాశం లేకపోలేదు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న సుమారు 27 లక్షల మంది ఉద్యోగులు బంద్‌లో పాల్గొంటుండటంతో విద్యుత్ సరఫరాపైనా ప్రభావం కనిపించవచ్చు. అలాగే రైళ్ల సేవల్లో ఆలస్యం ఏర్పడే అవకాశం కూడా ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి