Breaking News

బీసీలకు 42% రిజర్వేషన్లపై .. నేడు (జులై 10) కేబినెట్లో చర్చ

బీసీలకు 42% రిజర్వేషన్లపై .. నేడు (జులై 10) కేబినెట్లో చర్చ


Published on: 10 Jul 2025 09:17  IST

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీఎస్ రామకృష్ణా రావు తదితరులు హాజరుకానున్నారు.

ఈ భేటీలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, గతంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు స్థితి, తదితర అంశాలపై సమీక్ష చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టబోయే బనకచర్ల ప్రాజెక్టుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు – కీలక నిర్ణయం?!

స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 29% రిజర్వేషన్‌ను 42%కి పెంచే విషయంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈడబ్ల్యూఎస్ (EWS) కోటాకు 50 శాతం పైగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాజ్యాంగ సవరణ చేసిన నేపథ్యంలో, అదే తరహాలో బీసీ రిజర్వేషన్లు పెంచడం సాధ్యమేనని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. న్యాయ సలహా తీసుకున్న తరువాత దీనిపై సానుకూల సూచనలు వచ్చాయని సమాచారం. గత సంవత్సరం నవంబర్, డిసెంబర్‌లో జరిగిన కులగణన సర్వే మరియు ప్రత్యేక కమిషన్ నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఒకవేళ ఈ నిర్ణయాన్ని ఎవరైనా కోర్టులో ప్రశ్నించినా, ప్రభుత్వానికి బలమైన వాదనలు ఉన్నాయి. కోర్టులో ఆదేశాలు వస్తే, ఎన్నికల సమయంలో పార్టీ తరఫున రిజర్వేషన్లు ప్రకటించడానికీ అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఎన్నికలపై సమీక్ష

తెలంగాణ హైకోర్టు సూచనల ప్రకారం, స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30లోపు నిర్వహించాల్సిన నేపథ్యంలో, ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కూడా సమీక్షించనున్నారు. ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి, తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరిపే అవకాశముంది.

ప్రజా పథకాల విస్తరణపై చర్చ

రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల వంటి ప్రజాపథకాలను ఎలా మరింతగా ప్రజల్లోకి చేర్చాలన్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి