Breaking News

ఐదు విడతల్లో MPTC, ZPTC ఎన్నికలు..! స్టేట్ ఎలక్షన్ కమిషన్ కసరత్తు

రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఈసారి ఐదు విడతలుగా నిర్వహించాలన్న ఆలోచనపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందుకు సాగుతోంది.


Published on: 16 Jul 2025 09:32  IST

రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ఈసారి ఐదు విడతలుగా నిర్వహించాలన్న ఆలోచనపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందుకు సాగుతోంది. వర్షాకాలం నేపథ్యంలో రవాణా సమస్యలు, గిరిజన ప్రాంతాల్లో సిబ్బంది చేరడం వంటి లాజిస్టిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. గతంలో 2019లో వేసవికాలంలో మూడు విడతల్లో ఎన్నికలు జరిపినా, ఇప్పుడు వర్షాకాలం కావడంతో పరిస్థితులు భిన్నంగా ఉండబోతున్నాయి.

ప్రభుత్వం రిజర్వేషన్ల సమాచారం అందించిన వెంటనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించేలా కమిషన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, ఓటర్ల జాబితా పనులు పూర్తయ్యాయి. ఐదు విడతల పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తే సిబ్బంది, పోలీసుల తరలింపు, నిర్వహణ సులభంగా జరిగే అవకాశం ఉంది. వర్షాకాలం కావడంతో వర్షం పడితే ఓటింగ్‌కు, రవాణాకు ఆటంకాలు లేకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.

ఒక విడత నుంచి మరో విడతకు మధ్యలో ఈసారి రెండు నుంచి మూడు రోజుల గ్యాప్ మాత్రమే ఇవ్వాలని భావిస్తున్నారు. 2019లో అయితే నాలుగు రోజుల విరామం ఇచ్చారు. ఎలాగైనా 15 రోజుల వ్యవధిలో మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలనే లక్ష్యంతో సమాయత్తమవుతున్నారు. రిజర్వేషన్ల సమాచారం వచ్చిన తర్వాత పోలీసు అధికారులతో సమావేశమై తుది షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నారు.

ఇది పూర్తయిన తరువాత మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒకే రోజు నిర్వహించి, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనున్నారు. మొత్తం మీద వాతావరణ పరిస్థితులు, నిర్వహణ సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎన్నికలను విడతల వారీగా నిర్వహించేందుకు కమిషన్ ప్రణాళికలు రూపొందిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి