Breaking News

ఇవాళ ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ… బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం

ఇవాళ ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ… బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం


Published on: 17 Jul 2025 08:52  IST

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది. ఈ భేటీలో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై చర్చించనున్నారని సమాచారం. ప్రభుత్వం ఇప్పటికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపింది. ఈ క్రమంలో రాజ్యాంగంలో మార్పులు చేసి ఈ అంశాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని ప్రధాని మోదీని కోరే అవకాశం ఉంది.

ఇక రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌కి చేరుకున్న తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పై సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికలకు ముందు రిజర్వేషన్ల చట్టాన్ని సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించుకుంది. హైకోర్టు వేసిన గడువు దగ్గర పడుతుండటంతో, తక్షణమే చట్టసవరణ చేయాలన్న ఉద్దేశంతో న్యాయశాఖ, మంత్రులు, సీఎంల ఆమోదంతో ముసాయిదాను గవర్నర్‌కు పంపించారు.

ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు అనే నిబంధనను తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదమిస్తే, కొత్తగా ఏర్పడే కమిషన్ స్థానిక సంస్థలకు రిజర్వేషన్లపై సిఫార్సులు చేస్తుంది. దాని ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనుంది. అయితే గవర్నర్ ఆమోదిస్తారా లేదా అనేది కీలకం అయింది.

ఇదిలా ఉండగా, రాజకీయ వాతావరణం కూడా వేడెక్కుతోంది. బీసీలకు న్యాయం చేయాలని, రాజకీయ ప్రయోజనాల కోసం వారి హక్కులను హరించరాదని బీసీ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యాకే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేస్తోంది. మరోవైపు బీజేపీ ముస్లింలను బీసీ జాబితా నుంచి తొలగించకుండా బిల్లుకు క్లియర్ ఇవ్వలేమని చెబుతోంది. ఈ మొత్తం అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి