Breaking News

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. వైఎస్ జగన్ హాజరు అయ్యేనా..?

నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. వైఎస్ జగన్ హాజరు అయ్యేనా..?


Published on: 18 Sep 2025 10:33  IST

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాకాల శాసనసభ సమావేశాలు ఇవాళ (సెప్టెంబర్‌ 18) ఉదయం 9 గంటలకు మొదలయ్యాయి. 16వ శాసనసభ నాలుగో సమావేశంగా ఇవి నిర్వహించబడుతున్నాయి. మొత్తం ఏడురోజుల పాటు సమావేశాలు జరగనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో పలు ముఖ్యమైన బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

సమావేశాల తొలి రోజున ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ ప్రారంభమవుతుంది. అనంతరం ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశం కానుంది. అయితే, రాబోయే దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని సమావేశాల వ్యవధిని ఐదు రోజులకు పరిమితం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎన్ని రోజులు సమావేశాలు కొనసాగించాలన్న అంశంపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో BAC సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. స్పీకర్‌ అభిప్రాయం ప్రకారం, దసరా అనంతరం కూడా కొన్ని రోజులు అసెంబ్లీని కొనసాగించే అవకాశం ఉంది.

ఈ సమావేశాల్లో తాజాగా తీసుకువచ్చిన ఆరు ఆర్డినెన్స్‌లతో పాటు మొత్తం 20 బిల్లులను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కూటమి ప్రభుత్వం గత 15 నెలల్లో సాధించిన విజయాలను అసెంబ్లీ వేదికగా మరోసారి వివరించేందుకు కూడా సిద్ధమవుతోంది. ముఖ్యంగా “సూపర్‌ సిక్స్ – సూపర్‌ హిట్” కార్యక్రమం, DSC ద్వారా ఉద్యోగ నియామకాలు, రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చ జరగనుంది.

అలాగే, గత ప్రభుత్వ పాలనలో చోటుచేసుకున్న లిక్కర్‌ కేసు సహా అనేక అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తూ, వాటిపై చర్చించేందుకు ప్రస్తుత ప్రభుత్వం వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు ఈ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి