Breaking News

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్‌ఎస్ దృష్టి – ఫార్మ్‌హౌస్‌లో కేసీఆర్ కీలక సమావేశం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్‌ఎస్ దృష్టి – ఫార్మ్‌హౌస్‌లో కేసీఆర్ కీలక సమావేశం


Published on: 22 Oct 2025 12:47  IST

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక వ్యూహాలతో రంగంలోకి దిగుతున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ ఇంచార్జ్‌లు, కీలక నేతలను రేపు (గురువారం) ఆయన ఫార్మ్‌హౌస్‌కు పిలిపించి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఉపఎన్నిక ప్రచార వ్యూహాలపై కేసీఆర్ నేతలకు మార్గదర్శకాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే 40మందితో స్టార్ క్యాంపెయినర్‌ల జాబితాను బీఆర్‌ఎస్ ప్రకటించింది. అయితే కేసీఆర్ స్వయంగా ప్రచారంలో పాల్గొననున్నారో లేదో అన్నది ఇంకా స్పష్టత రాలేదు.

జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ సీటును తిరిగి గెలుచుకోవడం లక్ష్యంగా బీఆర్‌ఎస్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. పార్టీ తరపున మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టింది. ఆమె ప్రచారంలో దూసుకుపోతూ ప్రతి ప్రాంతంలో సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కేటీఆర్, హరీష్‌రావు సహా బీఆర్‌ఎస్ ప్రధాన నాయకులు సునీతకు మద్దతుగా రంగంలోకి దిగారు.

మరోవైపు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. రెండు పార్టీలు గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక చివరికి జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారో, ఎవరి చేతిలో ఈ హాట్‌సీటు దక్కబోతోందో చూడాలి.

Follow us on , &

ఇవీ చదవండి