Breaking News

EPFO కొత్త మార్పులు – ఉద్యోగులకి పెద్ద శుభవార్త!

EPFO కొత్త మార్పులు – ఉద్యోగులకి పెద్ద శుభవార్త!


Published on: 29 Oct 2025 10:01  IST

దేశవ్యాప్తంగా కోట్ల మంది ఉద్యోగులకు సంబంధించిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పెద్ద నిర్ణయం తీసుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం నెలకు రూ.15,000 జీతం వరకు ఉన్న ఉద్యోగులకే తప్పనిసరి ప్రావిడెంట్ ఫండ్ (EPF), పెన్షన్ స్కీమ్ (EPS) వర్తిస్తుండగా, త్వరలోనే ఈ పరిమితిని రూ.25,000కు పెంచే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనపై EPFO ట్రస్టీ బోర్డు చర్చించబోతోంది. డిసెంబర్ లేదా జనవరిలో ఈ అంశంపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

కార్మిక మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం, ఈ నిర్ణయం అమల్లోకి వస్తే దాదాపు కోటి మందికి పైగా ఉద్యోగులకు సామాజిక భద్రతా ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా మెట్రో నగరాల్లో నెలకు రూ.15,000 కంటే ఎక్కువ వేతనం పొందుతున్న మధ్యస్థ నైపుణ్య కార్మికులు కూడా ఈ పథకంలోకి వస్తారు. దీంతో వారు భవిష్యత్తులో EPF కింద పెన్షన్, వడ్డీ లాభాలు పొందే అవకాశం ఉంటుంది.

ప్రస్తుత నియమాల ప్రకారం ఉద్యోగి, యజమాని ఇద్దరూ జీతంలో 12 శాతం చొప్పున EPFకు జమ చేస్తారు. ఇందులో ఉద్యోగి మొత్తం EPFకు వెళ్తే, యజమాని వాటాలో కొంత EPFకు, కొంత EPSకు వెళ్తుంది. పరిమితి పెరగడం వల్ల EPF, EPS నిధులలో డిపాజిట్లు పెరుగుతాయి, దీని ఫలితంగా ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెరిగిన పెన్షన్, వడ్డీ రూపంలో లాభం చేకూరుతుంది.

EPFO ప్రస్తుతం రూ.26 లక్షల కోట్లకు పైగా నిధులను నిర్వహిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ కొత్త ప్రతిపాదన అమలయితే భారతీయ ఉద్యోగులకు మరింత దీర్ఘకాలిక ఆర్థిక భద్రత లభించనుంది. పెరుగుతున్న జీవన వ్యయాలు, అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో ఇది ఒక సానుకూల చర్యగా భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి