

ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ...10 నుంచి పెంచిన మెట్రో చార్జీలు అమలులోకి
హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ ఛార్జీల పెంపు త్వరలో అమలు కానుంది. ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అవుతుంది, 10 నుంచి పెంచిన చార్జీలు అమలులోకి వస్తాయి.
Published on: 05 May 2025 09:25 IST
హైదరాబాద్ ప్రజలకు త్వరలో మెట్రో రైల్ టికెట్ చార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ పెంపు దాదాపు ఖరారైనట్టు సమాచారం. గత కొంతకాలంగా ఈ విషయంపై ఆలోచిస్తున్న ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ, నష్టాలను తగ్గించుకోవాలన్న లక్ష్యంతో టికెట్ రేట్ల సవరణకు సిద్ధమవుతోంది.రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఛార్జీల సిఫార్సు కమిటీ (ఎఫ్‌ఎఫ్‌సీ) ఇచ్చిన నివేదిక ఆధారంగా టికెట్ ధరలు పెంచే విషయమై ప్రస్తుతం చర్చలు జరుపుతున్నారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవుతూ, ఆయన అనుమతి కోరే యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఈ అంశం సీఎం దృష్టిలో ఉన్నందున, ఆయన సానుకూలంగా స్పందించవచ్చని అధికారులు భావిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ నెల 10 నుంచి పెరిగిన టికెట్ ధరలు అమలులోకి రానున్నాయి.
కరోనా ముందు రోజుకు సగటున రూ.80 లక్షల ఆదాయం వచ్చినా, 2020 తర్వాత మెట్రో ఆదాయం గణనీయంగా తగ్గింది. ప్రయాణికుల సంఖ్య తగ్గడం, మాల్స్ & ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోవడం వంటి కారణాలు ప్రభావితంగా నిలిచాయి. రవాణా ఆధారిత అభివృద్ధి (టీవోడీ) కోసం ప్రభుత్వం కేటాయించిన 267 ఎకరాల భూమిలో ఇప్పటివరకు చాలా భాగం ఖాళీగానే ఉంది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో, మెట్రోపై ప్రయాణికుల సంఖ్యకు ప్రభావం పడిందని అధికారులు అంటున్నారు.
2022లో టికెట్ ధరలపై స్పష్టత తీసుకొచ్చేందుకు కేంద్రం ఎఫ్‌ఎఫ్‌సీని నియమించింది. ఈ కమిటీ ప్రజాభిప్రాయం సేకరించి నివేదికను సమర్పించింది. అయితే రాష్ట్ర ఎన్నికల కారణంగా ప్రక్రియ వాయిదా పడింది. ప్రస్తుతం మళ్లీ ఆ ప్రక్రియను గతి మీద పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.అంతేగాక, ఎఫ్‌ఎఫ్‌సీ నివేదిక ఆధారంగా 25% నుంచి 30% వరకు టికెట్ ధరలు పెంచే అవకాశముందని మెట్రో అధికారులు వెల్లడించారు. బెంగళూరులో ఇటీవలి కాలంలో 50% మేర చార్జీలు పెంచిన విషయాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ మార్పులతో ప్రతి ఏడాది రూ.150 నుండి రూ.170 కోట్ల వరకూ అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.