Breaking News

హైదరాబాద్ కేంద్రిత ఆక్సియమ్ గ్యాస్ ఐపీవో.. వచ్చే నెలలో లిస్టింగ్

హైదరాబాద్ కేంద్రిత ఆక్సియమ్ గ్యాస్ ఐపీవో.. వచ్చే నెలలో లిస్టింగ్


Published on: 09 Jan 2026 18:57  IST

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఆటో ఎల్‌పీజీ బంకుల నిర్వహణ సంస్థ ఆక్సియమ్ గ్యాస్ ఇంజనీరింగ్ లిమిటెడ్ త్వరలో ఐపీఓ ద్వారా పెట్టుబడిదారుల ముందుకు రానుంది. ఈ నెల చివరి వారంలో పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కానుందని, వచ్చే నెలలో షేర్ల లిస్టింగ్ జరిగే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

ఈ ఐపీఓ ద్వారా సుమారు రూ.40 నుంచి రూ.45 కోట్ల వరకు నిధులు సమీకరించాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు వెళ్తోంది. సమీకరించే మొత్తాన్ని ప్రధానంగా తమ వ్యాపార కార్యకలాపాల విస్తరణకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం ఆక్సియమ్ గ్యాస్ సంస్థ ‘ప్రైమ్ ఫ్యూయల్’ బ్రాండ్ పేరుతో పలు రాష్ట్రాల్లో ఆటో ఎల్‌పీజీ స్టేషన్లను నిర్వహిస్తోంది. తెలంగాణలో 11, మహారాష్ట్రలో 8, కర్ణాటకలో 2 స్టేషన్లు ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాల్లో సేవలను విస్తరించాలన్నదే సంస్థ లక్ష్యంగా ఉంది.

ఐపీఓకు సంబంధించి ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్ నుంచి ప్రాథమిక అనుమతులు కూడా లభించినట్లు సంస్థ ప్రకటించింది. ఈ పబ్లిక్ ఇష్యూలో భాగంగా రూ.5 ముఖ విలువ కలిగిన సుమారు 94.92 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నారు.

ఆటో ఎల్‌పీజీ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా ఆక్సియమ్ గ్యాస్ ముందడుగు వేస్తోందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఐపీఓ తర్వాత సంస్థ విస్తరణ ప్రణాళికలు ఎలా అమలవుతాయన్నది పెట్టుబడిదారుల ఆసక్తిని రేపుతోంది.

Follow us on , &

ఇవీ చదవండి