Breaking News

ఇంగ్లిషులో Protection of Children Against Sexual Offences Act అనే దాన్ని సంక్షిప్తంగా పోక్సో (POCSO) అని పిలుస్తున్నారు.

కాంగ్రెస్ హయాంలో 2012లో మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించడంతో చట్టంగా మారింది. పిల్లలపై లైంగిక దాడులకు కఠిన శిక్షలు వేసేలా అంతకుముందు చట్టాలు లేకపోవడంతో ఈ కొత్తం చట్టం(POCSO) తెచ్చారు.


Published on: 24 Mar 2025 16:58  IST

దేశంలో చిన్న పిల్లలపై లైంగిక దాడుల సంఖ్య పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2022లో పిల్లలపై నేరాలకు సంబంధించిన 1,62,449 కేసులు నమోదయ్యాయి, వీటిలో 64,500 కేసులు (సుమారు 39.7%) పోక్సో (POCSO) చట్టం కిందే నమోదయ్యాయి.

పోక్సో చట్టం వచ్చేందుకు కారణం
2012కు ముందు చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించిన ప్రత్యేక చట్టాలు లేవు. అప్పటివరకు ఐపీసీ (Indian Penal Code) లోని కొన్ని సెక్షన్ల ద్వారా మాత్రమే నేరస్తులను శిక్షించేవారు. ఉదాహరణకు:

354 సెక్షన్ – మహిళ గౌరవానికి భంగం కలిగించడాన్ని నేరంగా గుర్తించేది.(మహిళ గౌరవానికి భంగం కలిగించడం అంటే ఏంటనేది స్పష్టంగా లేదు. దీనితో కోర్టు తీర్పులను బట్టి మారేది.దానికి తోడు చిన్న పిల్లల్లో అబ్బాయిలపై ఏదైనా నేరం జరిగితే ఈ సెక్షన్ కింద అది నేరం కాబోదు.అన్నిటికీ మించి ఇది రాజీపడదగిన కేసు)
375 సెక్షన్ – అత్యాచారం (రేప్) కి సంబంధించినది. అయితే, కేవలం శరీరంలోని కొన్ని భాగాల్లో మాత్రమే పెనిట్రేషన్ జరిగితేనే ఇది నేరంగా పరిగణించేవారు.(ఈ సెక్షన్ కూడా చిన్న పిల్లల్లకూ, అందునా మగ పిల్లలకు ఏ ప్రత్యేక రక్షణా ఇవ్వడం లేదు.)
377 సెక్షన్ –ప్రకృతి వ్యతిరేక లైంగిక చర్యల కోసం ఉపయోగించేవారు.(ఒకే జెండర్ వ్యక్తుల మధ్య శృంగారంతో పాటూ, ఇతరత్రా అసహజ లైంగిక చర్యల జరిగితే ఈ సెక్షన్ ఉపయోగించేవారు. అప్పుడు కూడా పెనేట్రేషన్ జరిగితేనే ఈ సెక్షన్ కింద శిక్ష పడుతుంది.)  
ఈ మూడు సెక్షన్ల వల్ల చిన్న పిల్లలకు అందునా మగ పిల్లలకు సరైన న్యాయం దొరకడం కష్టమయ్యేది. 

అందుకే పిల్లలకు ప్రత్యేక రక్షణ కోసం 2012లో పోక్సో చట్టం తీసుకొచ్చారు.

అంతకుముందు సంప్రదాయ ఐపీసీ పరిధిలోకి రాని అనేక అంశాలను ఇందులో నేరాలుగా గుర్తించారు. చిన్న పిల్లల విషయంలో అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా అందరికీ రక్షణ కల్పించారు. దీనివల్ల చిన్న వాళ్లయినా మగ పిల్లలపై నేరాలు చేసే వారిని కూడా శిక్షించొచ్చు.

పోక్సో చట్టంలో ప్రధాన అంశాలు
పిల్లలపై లైంగిక దాడులు జరిగితే శిక్ష పడుతుంది.
అబ్బాయిలైనా, అమ్మాయిలైనా తేడా లేకుండా చిన్నారులకు రక్షణ కల్పించారు.
కేవలం పెనిట్రేషన్ జరిగితేనే నేరమనే పరిమితిని తొలగించారు.
నేరాల విచారణ కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేశారు.
చిన్నారులపై లైంగిక దాడి, వేధింపు, అసభ్య ప్రవర్తన,పిల్లలు ఉన్న పోర్నోగ్రఫీ చూసినా నేరమే.
కొత్త చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు
పెనెట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్– పిల్లల శరీరంలో ఏదైనా భాగాన్ని బలవంతంగా చొప్పించడం లేదా అలా చేయమని చెప్పడం నేరం.
సెక్సువల్ అసాల్ట్– పిల్లలను లైంగిక ఉద్దేశంతో తాకడం లేదా తాకమని ప్రేరేపించడం నేరం.
సెక్సువల్ హెరాస్మెంట్– అశ్లీల సంకేతాలు, అసభ్య వ్యాఖ్యలు, శరీర అవయవాలను చూపించడం నేరం.
పిల్లల పోర్నోగ్రఫీ– చిన్నారుల‌కు సంబంధించి పోర్నోగ్రఫీ చూడడం లేదా వ్యాప్తి చేయడం నేరం.
ఇవన్నీ కొత్త చట్టంలో నేరాలుగా గుర్తించారు. జెండర్ నూట్రల్ చట్టం అవడం వల్ల పెద్దవారైనా, చిన్నవారైన ఆడయినా మగయినా దీనికింద కేసు పెట్టవచ్చు.

కేసు దర్యాప్తు, కోర్టులో విచారణ సమయంలో పిల్లలకు ఇబ్బంది కలగని విధంగా చట్టంలో చర్యలు తీసుకున్నారు. దీనికోసం 1098 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ప్రతి పోక్సో కేసునూ పోలీసు అధికారులు 24 గంటల్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి నివేదించాలి.

బీజేపీ ప్రభుత్వం 2019లో ఈ చట్టాన్ని మరింత కఠినతరం చేసింది.

పెనెట్రేటివ్ నేరానికి 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచారు.
బాధితులు 16 ఏళ్ల లోపు అయితే 20 ఏళ్ల శిక్ష లేదా యావజ్జీవ ఖైదు లేదా మరణ శిక్ష కూడా విధించేలా చట్టాన్ని మార్చారు.
చాలా మంది చట్ట దుర్వినియోగం చేస్తున్నారనే వాదన కూడా ఉంది.

18 ఏళ్ల లోపు పిల్లలు పరస్పర సమ్మతితో లైంగిక సంబంధం కలిగినా, ఇది పోక్సో చట్టం ప్రకారం నేరంగానే పరిగణించబడుతుంది. దీన్ని కొందరు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు..
ఎంతోమంది ప్రేమికులు ఇంటి నుండి పారిపోతే, కుటుంబ సభ్యులు కేవలం తమ కోపాన్ని చూపించడానికి పోక్సోను ఉపయోగిస్తున్న సందర్భాలు ఉన్నాయి.
ఒకసారి కేసు నమోదైతే రాజీకి అవకాశం లేదు, అలా ఇద్దరూ ప్రేమలో ఉన్నా కూడా చట్ట ప్రకారం శిక్ష తప్పదు.
చట్టాన్ని తప్పుగా ఉపయోగించొద్దని న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ, చిన్నారుల రక్షణ కోసం ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని న్యాయవాదులు చెప్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి