Breaking News

సింగరేణిలో లక్ష్యానికి మూడు మిలియన్ టన్నులు వెనుకంజ..

కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరానికి మూడు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేకపోయింది.


Published on: 02 Apr 2025 00:03  IST

గోదావరిఖని: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న సింగరేణి (Singareni) సంస్థ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మూడు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో వెనుకబడి, నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. సింగరేణి సంస్థ 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉండగా, మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి కేవలం 69 మిలియన్ టన్నులకే పరిమితమైంది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసిన సింగరేణి, ఈ ఏడాది ఒక మిలియన్ టన్నుల బొగ్గు తక్కువగా ఉత్పత్తి చేసింది. గత ఏడాదితో పోలిస్తే తగ్గిన ఉత్పత్తి కారణంగా, 2024-25లో అమ్మకాలు, లాభాలపై ప్రభావం పడే అవకాశముంది. సింగరేణి సంస్థ మార్చి నెలలో 8.91 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినా, నిర్దేశిత 72 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.

11 ఏరియాల్లో కేవలం నాలుగు డివిజన్లలోనే నిర్దేశిత లక్ష్యాలు చేరుకున్నాయి.

  • ఇల్లందు ఏరియా: 41.30 లక్షల టన్నుల లక్ష్యానికి 42.75 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి (104%)

  • రామగుండం-3 డివిజన్: 62.50 లక్షల టన్నుల లక్ష్యానికి 65.11 లక్షల టన్నులు (104%)

  • రామగుండం-1 డివిజన్: 49.40 లక్షల టన్నుల లక్ష్యానికి 49.64 లక్షల టన్నులు (100%)

  • మణుగూరు డివిజన్: 127.60 లక్షల టన్నుల లక్ష్యానికి 127 లక్షల టన్నులు (100%)

లక్ష్యాన్ని చేరుకోలేకపోయిన ఏరియాలు

  • కొత్తగూడెం: 149.50 లక్షల టన్నుల లక్ష్యానికి 144.17 లక్షల టన్నులు (96%)

  • బెల్లంపల్లి: 38.50 లక్షల టన్నుల లక్ష్యానికి 37.50 లక్షల టన్నులు (97%)

  • మందమర్రి: 34.60 లక్షల టన్నుల లక్ష్యానికి 27.11 లక్షల టన్నులు (78%)

  • శ్రీరాంపూర్: 63.10 లక్షల టన్నుల లక్ష్యానికి 57.86 లక్షల టన్నులు (92%)

  • రామగుండం-2: 98.70 లక్షల టన్నుల లక్ష్యానికి 97.77 లక్షల టన్నులు (99%)

  • అడ్రియాలా: 5.20 లక్షల టన్నుల లక్ష్యానికి 4.09 లక్షల టన్నులు (79%)

  • భూపాలపల్లి: 49.60 లక్షల టన్నుల లక్ష్యానికి 37.02 లక్షల టన్నులు (75%)

2025 జనవరి నుంచి మార్చి వరకు సింగరేణి కార్మికులకు ఉత్పత్తికి అనుగుణంగా ప్రోత్సాహక బహుమతులు అందించడంతో, చివరి మూడు నెలల్లో ఉత్పత్తిలో మెరుగుదల కనిపించింది.

2025-26కు 76 మిలియన్ టన్నుల లక్ష్యం

సింగరేణి సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26) 76 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25లో సాధించిన 69 మిలియన్ టన్నులకు మరో 7 మిలియన్ టన్నుల అదనపు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ నుంచి ఉత్పత్తి మొదలవడంతో పాటు, కొత్తగా మరో రెండు గనులు ప్రారంభం కానున్నాయి. ఈ పరిణామాలతో ఈసారి నిర్దేశిత 76 మిలియన్ టన్నుల ఉత్పత్తిని చేరుకోవడానికి సింగరేణి సంస్థ కృషి చేయనుంది.

Follow us on , &

ఇవీ చదవండి