Breaking News

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు మళ్లీ రచ్చ..పార్టీని నాశనం చేసేందుకు బీర్ల ఐలయ్య కుట్ర

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు మళ్లీ రచ్చ..పార్టీని నాశనం చేసేందుకు బీర్ల ఐలయ్య కుట్ర


Published on: 26 Sep 2025 15:20  IST

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ప్రభుత్వ వీప్ బీర్ల ఐలయ్యపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కఠిన వ్యాఖ్యలు చేశారు.

శుక్రవారం విలేకరులతో మాట్లాడిన ఆయన, “బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యే ప్రయత్నాలు జరుగుతున్నాయి” అని ఆరోపించారు.

సామేల్ మాట్లాడుతూ, “మీ వ్యక్తిగత బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టకండి. మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే ఐలయ్య పార్టీకి రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు. అంతేకాక, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. “కాంగ్రెస్‌ నుంచి వైదొలిగి, ఇతర పార్టీలతో స్నేహం చేయాలనుకుంటే స్పష్టంగా చెప్పండి” అని సూచించారు.

మదర్ డెయిరీ ఎన్నికలపై రాజకీయ ఉద్రిక్తత

సెప్టెంబర్ 27న జరగనున్న మదర్ డెయిరీ పాలకవర్గం ఎన్నికలు జిల్లాలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈసారి మూడు డైరెక్టర్ పోస్టులలో రెండు స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు, ఒక స్థానాన్ని బీఆర్ఎస్ మద్దతుదారు గెలుచుకునేలా రహస్య ఒప్పందం కుదిరిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటికే బద్ధ శత్రువులుగా ఉన్న అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య ఇలాంటి అవగాహన కుదరటం స్థానికంగా పెద్ద చర్చకు దారితీసింది.

ఓటింగ్, ఫలితాల ప్రకటన

మదర్ డెయిరీ డైరెక్టర్ పదవుల కోసం సెప్టెంబర్ 27న పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు చేసి విజేతలను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి