Breaking News

కంకర రోడ్డుపై నడవలేక ఇబ్బందిపడుతున్నా, మాపై దయ చూపరా..

కాంగ్రెస్ ప్రభుత్వం లో ఆగిపోయిన పనులు . కాంట్రాక్టర్‌ తన బిల్లులు అందడం లేదంటూ వెనక్కి వెళ్లిపోయాడు.


Published on: 02 Apr 2025 12:47  IST

రామాయంపేట, ఏప్రిల్‌ 1: "కంకర రోడ్డుపై నడవలేక ఇబ్బందిపడుతున్నా, మాపై దయ చూపరా.." అంటూ కోమటిపల్లి గిరిజన తండా ప్రజలు అధికారులను, నాయకులను వేడుకుంటున్నారు. రామాయంపేట పురపాలక పరిధిలోని ఈ తండాకు కనీస వసతులు లేక, ప్రజలు రోజూ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు.

రెండేళ్ల కిందట,బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. 1.5 కోట్లు ఖర్చుతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. కానీ, ప్రభుత్వం మారిన తర్వాత పనులు ఆగిపోయాయి. కంకర పనులు పూర్తయ్యాక, కాంట్రాక్టర్‌ తన బిల్లులు అందడం లేదంటూ వెనక్కి వెళ్లిపోయాడు.

కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, తండాలో పరిస్థితిలో మార్పు రాలేదు. రెండేళ్లుగా కంకర రోడ్డు వల్ల గిరిజనులు నడవలేక, ప్రమాదాల బారిన పడుతున్నారు. తండా ప్రజలకు కనీస వసతులు కూడా అందడం లేదు. మిషన్‌ భగీరథ నీటి సరఫరా సరిగ్గా లేక, తండా వాసులు కిలోమీటర్ల దూరం వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

"మున్సిపల్‌ అధికారులకు చెప్పినా ఉపయోగం లేకపోయింది. ప్రతి సారి విచారణకు వస్తామని, చూస్తామని చెప్పి కాలయాపన చేస్తున్నారు," అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తండాకు కనీస వసతులు, మంచినీటి సరఫరా కల్పించాలని ప్రభుత్వం, స్థానిక అధికారులను కోరుతున్నారు.

కాంట్రాక్టర్ గల్లంతు – రోడ్డు పనులు ఆగిపోయిన దుస్థితి

కంకర రోడ్డును నిర్మించేందుకు పంపిన కాంట్రాక్టర్‌ నిధులు రాలేదంటూ పనులను వదిలేసి వెళ్లిపోయాడు. ఇప్పుడా రోడ్డు గిరిజనులకు పెద్ద సమస్యగా మారింది. "ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు ఒక్కసారి కూడా తండాకు రాకపోవడం బాధ కలిగిస్తోంది," అని తండా ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

రామాయంపేట దవాఖానకు వెళ్లాలంటే ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. "సాధారణంగా అరగంటలో చేరాల్సిన దూరం, ఈ దారుణమైన రోడ్డుతో రెండు గంటల సమయం పడుతుంది," అని స్థానికులు వాపోతున్నారు.గ్రామస్థులు వెంటనే రోడ్డు పనులను పూర్తి చేసి, తాగునీటి సరఫరా అందజేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు

Follow us on , &

ఇవీ చదవండి