Breaking News

కందిలో పదిరోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

కందిలో పదిరోజులుగా నీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కిలోమీటర్ల మేర వెళ్లి నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Published on: 02 Apr 2025 12:10  IST

కంది, ఏప్రిల్ 1: కందిలో పది రోజులుగా తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిలోమీటర్ల దూరం వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్‌ భగీరథ ద్వారా వచ్చే నీటి సరఫరా మరమ్మతుల కారణంగా నిలిచిపోయిందని, గ్రామంలో ఉన్న నాలుగు బోర్లు కూడా మోటర్లు పనిచేయకపోవడంతో నీటి సమస్య మరింత తీవ్రతరమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ పరిస్థితిని నిరసిస్తూ మంగళవారం గ్రామ మహిళలు, ప్రజలు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం ఎదుట బైఠాయించి నీటి సమస్య తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పండుగల సమయంలో నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పది రోజులుగా తాగేందుకు, వాడుకోవడానికి నీటి కోసం అలమటిస్తున్నామని వాపోయారు.

అధికారుల నిర్లక్ష్యం – ప్రజల ఆగ్రహం

గ్రామంలో నాలుగు బోర్లు ఉన్నా, మోటర్లు పనిచేయకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. పంచాయతీ అధికారులకు సమస్యను ఎన్నిసార్లు చెప్పినా స్పందన లేకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే మోటర్లను బిగించి సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఒక బోరుకు తాత్కాలిక మరమ్మతులు

ప్రజల నిరసన నేపథ్యంలో అధికారులు ఒక బోరుకు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. కంది తహసీల్దార్‌ విజయలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్‌ మల్లయ్య 3వ వార్డులో ఒక బోరును పనిచేసేలా చేసి, ఆ ప్రాంతానికి తాగునీటి సరఫరా అందించేలా చర్యలు తీసుకున్నారు. మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ మరమ్మతులు పూర్తయిన తర్వాత పూర్తిస్థాయిలో నీటి సరఫరా కొనసాగుతుందని హామీ ఇచ్చారు.

ఆ సమయంలో నీటి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించేందుకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తామని అధికారులు తెలిపారు. గ్రామస్థుల ఆరోపణలతో సమస్య తక్షణమే పరిష్కారమవుతుందా? లేదా మళ్లీ ఉద్యమించాల్సి వస్తుందా? అనేది వేచి చూడాలి.

Follow us on , &

ఇవీ చదవండి