Breaking News

సిరీస్‌ భారత్‌ కైవసం, ఇక పాకిస్థాన్‌తో మ్యాచ్‌పై ఆసక్తి

India vs Ireland: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచు వర్షార్పణం అయింది. ఎడతెరిపి లేకుండా పర్షం కురవడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచు రద్దయింది. ఈ మేరకు అంపైర్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో మూడో టీ20ల సిరీస్‌ను భారత్‌ 2-0తో గెలుచుకుంది. ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్‌లో భారత్‌ బరిలోకి దిగనుంది.


Published on: 24 Aug 2023 08:47  IST

ఐర్లాండ్‌ పర్యటనలో భాగంగా తొలి రెండు టీ20 మ్యాచులో గెలిచి జోరు మీదున్న భారత జట్టుకు వరుణుడు బ్రేక్‌ వేశాడు. మూడో టీ20లోనూ గెలిచి సిరీస్‌ను 3-0తో గెలుచుకోవాలని జస్‌ప్రీత్‌ బుమ్రా నేతృత్వంలోని టీమిండియా పెట్టుకున్న ఆశలపై వర్షపు నీళ్లు చల్లాడు. ఇరు జట్ల మధ్య బుధవారం జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా టాస్‌ పడకుండానే రద్దయింది.

వర్షం దాదాపు మూడున్నర గంటల పాటు ఏకధాటిగా కురిసింది. అనంతరం కాస్త తగ్గినప్పటికీ.. వర్షపు నీటితో గ్రౌండ్‌ చిత్తడిగా మారింది. దీంతో మ్యాచు నిర్వహణ సాధ్యం కాదని అంపైర్లు వెల్లడించారు. మ్యాచును రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫలితంగా తొలి రెండు టీ20ల్లో గెలిచిన భారత జట్టు 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌ ద్వారానే రీఎంట్రీ ఇచ్చిన కెప్టెన్‌ బుమ్రా.. ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు.

ఇక ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ ముగియడంతో మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న ఆసియా కప్‌ కోసం భారత్‌ మైదానంలోకి దిగనుంది. మొత్తంం ఆరు దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటాయి. సెప్టెంబరు 2న తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.ఆసియా కప్‌లో భాగంగా గ్రూప్‌ ఏలో భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌ ఉన్నాయి. గ్రూప్‌ బిలో బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, శ్రీలంకలు పోటీ పడనున్నాయి. సెప్టెంబర్‌ 17న జరిగే ఫైనల్‌ మ్యాచుతో విజేత ఎవరో తేలిపోనుంది.

Follow us on , &

Source From: BS News

ఇవీ చదవండి