Breaking News

భారత్‌ రక్షణ రంగంలో ఫొటానిక్‌ రాడార్‌ సాధనతో కీలక మైలురాయి

ఈ ఫొటానిక్‌ రాడార్‌ను బెంగళూరులో ఉన్న డీఆర్డీవోకి చెందిన ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ రాడార్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (LRDE) అభివృద్ధి చేసింది.


Published on: 07 Jul 2025 09:09  IST

భారతదేశ రక్షణ శక్తిని మరింత బలోపేతం చేస్తూ దేశీయంగా అభివృద్ధి చేసిన ఆధునిక ఫొటానిక్‌ రాడార్‌ భారత్‌కు సాంకేతికంగా అత్యున్నత స్థానాన్ని సాధింపజేసింది. శత్రువుల వైమానిక దాడులను ముందే గుర్తించడానికి ఇది దోహదపడుతుంది. ముఖ్యంగా స్టెల్త్‌ టెక్నాలజీ కలిగిన యుద్ధవిమానాలను, డ్రోన్లను గుర్తించడంలో సాధారణ రాడార్లు తడబడే సందర్భాల్లో ఫొటానిక్‌ రాడార్‌ తన ఆధునిక పరిజ్ఞానంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ టెక్నాలజీ అభివృద్ధి దేశానికి మిలిటరీ టెక్నాలజీ రంగంలో కొత్త ద్వారాలను తెరుస్తోంది.

ఈ ఫొటానిక్‌ రాడార్‌ను బెంగళూరులో ఉన్న డీఆర్డీవోకి చెందిన ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ రాడార్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (LRDE) అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు రేడియో తరంగాలను ఆధారంగా చేసుకున్న సంప్రదాయ రాడార్లతో వ్యవహరించాం. అయితే, వాటి పరిమితులు ఉండడంతో, ప్రత్యేకించి స్టెల్త్‌ విమానాలు, తక్కువ ఎత్తులో చక్కర్లు కొడుతూ వచ్చే డ్రోన్లను గుర్తించడంలో అవి సవాలుకి గురయ్యాయి. ఫొటానిక్‌ రాడార్‌ అయితే వాటికి ప్రత్యామ్నాయం, పైగా మెరుగైన పరిష్కారం.

ఫొటానిక్‌ రాడార్‌ వ్యవస్థలో రేడియో తరంగాల స్థానంలో కాంతి తరంగాలను ఉపయోగిస్తారు. దీని వల్ల మరింత స్పష్టతతో, వేగంగా లక్ష్యాలను గుర్తించే సామర్థ్యం ఉంటుంది. లేజర్లు, ఆప్టికల్‌ ఫైబర్లు వంటి ఆధునిక ఉపకరణాలతో దీనిని రూపొందించారు. ఫలితంగా, దీనిలో బ్యాండ్‌విడ్త్ పరిమితి ఉండదు. స్పెక్ట్రమ్‌లోని అనేక తరంగ దైర్ఘ్యాలను ఉపయోగించగలగడం ద్వారా ఇది విశాల పరిధిలో పని చేయగలదు. ఈ రంగంలో అమెరికా, చైనా, ఇజ్రాయెల్‌ వంటి దేశాల సరసన భారత్‌ కూడా చేరిపోయింది.

ఈ రాడార్‌తో ఒకేసారి అనేక లక్ష్యాలను త్రీడీ ఫార్మాట్‌లో గుర్తించగల సామర్థ్యం ఉంది. కచ్చితమైన లక్ష్య విశ్లేషణతో పాటు వేగంగా స్పందించగలగడం దీని ముఖ్యమైన గుణలక్షణం. ప్రత్యేకంగా స్టెల్త్‌ టెక్నాలజీ కలిగిన యుద్ధవిమానాలు, డ్రోన్లు, క్షిపణులను గుర్తించడంలో ఇది అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే శత్రువులు సాధారణంగా చేసే ఎలక్ట్రానిక్‌ జామింగ్‌, ఇతర డిజిటల్‌ అంతరాయం వ్యూహాలను ఇది తట్టుకోగలదు.

ఫొటానిక్‌ రాడార్‌ వల్ల తక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది, దీని వల్ల దీర్ఘకాలికంగా పనిచేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఉపయోగించే ఫొటానిక్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్క్యూట్లు సంకేతాలను త్వరగా విశ్లేషించగలగడం వల్ల సమాచార నష్టం చాలా తక్కువగా ఉంటుంది. దీని పని తీరును పరీక్షించడానికి డీఆర్డీవో ఈ సంవత్సరం చివరినుంచి విస్తృత స్థాయిలో పరిశీలనలు ప్రారంభించనుంది. పర్వత ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.

ఫొటానిక్‌ రాడార్‌ను ప్రస్తుతం దేశంలోని కీలక గగనతల రక్షణ వ్యవస్థలైన ‘ఆకాశ్‌తీర్‌’ వంటి సిస్టమ్‌లతో అనుసంధానం చేయాలని ప్రణాళిక ఉంది. అలాగే, అత్యాధునిక యుద్ధవిమానాలైన సుఖోయ్‌-30 MKI, రఫేల్‌, తేజస్‌ విమానాల్లో దీన్ని అమర్చే అవకాశం ఉంది. దీని కాంపాక్ట్‌ డిజైన్‌ వల్ల మొబైల్ వాహనాలపై అమర్చడం కూడా సాధ్యం కావడం వల్ల, సరిహద్దుల్లో దీన్ని సులభంగా మోహరించవచ్చు. ముఖ్యంగా పాకిస్థాన్‌, చైనా వంటి దేశాలతో ఉన్న సరిహద్దుల్లో దీని వినియోగం ద్వారా బలమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు.

చైనా, పాకిస్థాన్‌లు స్టెల్త్‌ ఫైటర్లు, డ్రోన్ల అభివృద్ధిపై ఎంతో నిధులు ఖర్చు చేస్తూ రక్షణ రంగంలో ఆధిపత్యం సాధించాలనే లక్ష్యంతో ఉన్నప్పుడు, భారత్‌ ఈ ఫొటానిక్‌ రాడార్‌ అభివృద్ధితో వారికే ఒక రకంగా సవాల్‌ విసిరింది. చైనాకు చెందిన జె-20 స్టెల్త్‌ యుద్ధవిమానాలు, పాక్‌కు చెందిన డ్రోన్లు రాడార్లను తప్పించేందుకు రూపొందించబడ్డవే అయినా, ఫొటానిక్‌ టెక్నాలజీ ముందు అవి నిలబడలేను.

ఈ రాడార్లను గగనతల హెచ్చరిక వ్యవస్థల్లో భాగంగా కూడా అమర్చవచ్చు. దీంతో శత్రు క్షిపణులు లేదా హైపర్‌సోనిక్‌ ఆయుధాలు వచ్చినా ముందే తెలుసుకోవచ్చు. దేశ రక్షణలో ఇది కీలకంగా మారబోతోంది. ఈ విధంగా భారతదేశం రక్షణ రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. టెక్నాలజీ పరంగా మరింత స్వావలంబన దిశగా అడుగులు వేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి