Breaking News

భారత్‌ స్టార్ వార్స్ టెక్నాలజీలో కొత్త అధ్యాయం!

ఈ టెక్నాలజీ అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్ దేశాల వద్ద ఉంది. ఇప్పుడు భారత్ కూడా వాటి సరసన నిలబడింది.


Published on: 15 Apr 2025 10:28  IST

భారత్‌ మరో అడుగు ముందుకేసింది. శత్రు డ్రోన్లు, క్షిపణులను లేజర్ కాంతుల సాయంతో ధ్వంసం చేసే శక్తివంతమైన వ్యవస్థను విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగాన్ని ఏప్రిల్ 13న కర్నూలు సమీపంలోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్‌లో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) నిర్వహించింది.

ఈ "లేజర్ టెక్నాలజీ వెపన్" సిస్టమ్‌తో భారత్ ప్రపంచంలోనే అరుదైన టెక్నాలజీ కలిగిన దేశాల్లో ఒకటిగా నిలిచింది. దీనిని భవిష్యత్‌లో ‘‘స్టార్ వార్స్ టెక్నాలజీ’’గా పరిగణిస్తున్నారు.

ప్రపంచం మొత్తంగా యుద్ధాల తీరూ మారిపోతోంది. ఇప్పుడిప్పుడే మిసైల్స్ కన్నా డ్రోన్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఈ మార్పుని బాగా చూపించింది. భవిష్యత్తులో డ్రోన్ల దాడులకు ప్రతిఘటనగా, అత్యాధునిక టెక్నాలజీ అభివృద్ధి అవసరం ఎంతగానో ఉంది. ఈ నేపథ్యంలో హై పవర్ లేజర్, హైపర్ మైక్రోవేవ్ టెక్నాలజీలను ఉపయోగించి ఆయుధాలను అభివృద్ధి చేస్తున్నారు.

డీఆర్డీవో రూపొందించిన లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ (డీఈడబ్ల్యూ) MK-II(A) ఈ ప్రయోగంలో ప్రధాన పాత్ర పోషించింది. ఇది భూమి మీద నుంచే లక్ష్యాన్ని ఖచ్చితంగా కాల్చగలదు. సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ (చెస్) ఆధ్వర్యంలో ఈ టెస్ట్ జరిగింది. ఈ క్రమంలో ఒక మానవ రహిత విమానం (UAV) పై లేజర్ కిరణాలు ప్రయోగించి కూల్చివేశారు. దీనికి సంబంధించిన వీడియోను అధికారికంగా ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) లో విడుదల చేశారు.

డీఆర్డీవో చైర్మన్ సమీర్ వి. కామత్ మాట్లాడుతూ, “ఈ టెక్నాలజీ అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్ దేశాల వద్ద ఉంది. ఇప్పుడు భారత్ కూడా వాటి సరసన నిలబడింది,” అన్నారు. డీఈడబ్ల్యూ ద్వారా తేలికపాటి UAVలతో పాటు డ్రోన్లు, హెలికాప్టర్లను కూడా నాశనం చేయవచ్చని చెప్పారు.

ఇది ఇంకా ప్రారంభ దశే అని, ఇకపై మరిన్ని శక్తివంతమైన లేజర్ ఆయుధాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రస్తుతం 20 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ఛేదించగల 300 కిలోవాట్ల లేజర్ వెపన్‌ను రూపొందిస్తున్నారు.

“ఇప్పటివరకు భూమి మీదే పనిచేసే లేజర్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశాం. త్వరలో ఈ టెక్నాలజీని వాయు మరియు సముద్ర మార్గాల్లో కూడా వినియోగించేందుకు తయారవుతున్నాం,” అని అన్నారు సమీర్ వి. కామత్.

మరోవైపు, మాజీ డీఆర్డీవో చైర్మన్ జి. సతీష్ రెడ్డి మాట్లాడుతూ, “ఇది భారత రక్షణ రంగానికి కీలకమైన ముందడుగు” అని అన్నారు. అలాగే, లేజర్ ఆయుధాల తయారీ ఖర్చు చాలా తక్కువగా ఉండటంతో, ఇది క్షిపణుల కంటే చవకైన ప్రత్యామ్నాయమని డీఆర్డీవో అధికారులు వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి