Breaking News

హైదరాబాద్‌ నుంచి అమరావతికి నేరుగా గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల అధికారులతో పునర్విభజన చట్టంలో ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న అంశాలపై కేంద్ర ప్రభుత్వం విస్తృత చర్చలు .


Published on: 09 Apr 2025 17:53  IST

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టానికి సంబంధించిన పరిష్కారంకాల సమస్యలపై కేంద్ర హోంశాఖ తాజాగా దృష్టిసారించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన వివిధ విభజన అంశాల పరిష్కారానికి సంబంధించి విభిన్న శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.

ఫిబ్రవరి 3న, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో 15 కీలక శాఖల అధికారులు పాల్గొన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రోడ్లు-రవాణా, బొగ్గు, ఉక్కు, వ్యవసాయం, రైల్వే, పెట్రోలియం వంటి శాఖల అధికారులతో విస్తృత చర్చలు జరిగాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి వచ్చిన ప్రతిపాదనలతో పాటు, పునర్విభజన చట్టంలో ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చ సాగింది.

ఏమేం నిర్ణయాలు తీసుకున్నారు?

  • హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్టుకు కేంద్రం ప్రాథమిక ఆమోదం తెలిపింది. ప్రాజెక్టు రూపొందించడానికి డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేయాలని రవాణా శాఖను ఆదేశించింది.

  • తెలంగాణలోని రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగానికి సంబంధించిన అనుమతులు త్వరగా పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

  • గతంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన నిధులు ఇంకా విడుదల కాలేదన్న విషయం కేంద్రం గుర్తించింది. త్వరితంగా ఆ నిధులు విడుదల చేసే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించింది.

  • అలాగే తెలంగాణకు సంబంధించి ఆర్థిక అంశాలపై నీతి ఆయోగ్‌తో చర్చించి పరిష్కారం కనుగొనాలంటూ హోంశాఖ అధికారులను ఆదేశించింది.

ఈ సమీక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై మినిట్స్‌ను ఇటీవలే రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు పంపారు. దీంతో, గతకొంత కాలంగా సాగుతున్న అపరిష్కృత అంశాలకు త్వరలో పరిష్కార మార్గం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి