Breaking News

డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌లు పై తన నిర్ణయాన్ని మార్చుకున్నాడా...?

డొనాల్డ్ ట్రంప్ 90రోజుల పాటు కొత్త టారిఫ్‌లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఉన్న 10శాతమే అప్పటిదాకా అమలు చేయాలని నిర్ణయించారు.


Published on: 10 Apr 2025 10:46  IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం – 90 రోజుల సుంకాల విరామం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన తాజా నిర్ణయంతో అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక మలుపు తీసుకొచ్చారు. ఇటీవలే ప్రపంచ దేశాల నుండి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ అధిక సుంకాలు విధించాలని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇవి బుధవారం నుంచే అమలులోకి వస్తాయని మొదట ప్రకటించగా, అఖరి నిమిషంలో ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.

నూతనంగా విధించాల్సిన ఈ సుంకాలను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి మునుపటి 10 శాతం సుంకాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల భారత్‌ సహా అనేక దేశాలకు తాత్కాలిక ఊరట లభించింది.

ఇతర దేశాలకు సడలింపు ఇచ్చినప్పటికీ, చైనా విషయంలో మాత్రం ట్రంప్ వెనక్కి తగ్గలేదు. ఇప్పటికే చైనా వస్తువులపై ఉన్న 104 శాతం టారిఫ్‌ను 125 శాతానికి పెంచారు. దీనికి ప్రతిగా చైనా కూడా అమెరికా దిగుమతులపై 84 శాతం వరకు సుంకాలు పెంచింది. ఈ నేపథ్యంలో అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమవుతోంది.

ట్రంప్ 90 రోజుల విరామం ప్రకటించిన వెంటనే ఆసియా మార్కెట్లలో పాజిటివ్ వాతావరణం ఏర్పడింది. జపాన్ నిక్కీ 225 సూచిక 8 శాతం పెరిగింది. దక్షిణ కొరియా కోస్పీ 5 శాతం, ఆస్ట్రేలియా ASX 200 కూడా 5 శాతం పెరిగాయి. ఇదే సమయంలో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు నమోదుచేశాయి. డౌ జోన్స్ 7.25 శాతం పెరిగి 40,374 పాయింట్లను, నాస్డాక్ 12 శాతం పెరిగి 17,124 పాయింట్లను, ఎస్ & పీ 500 కూడా 9.5 శాతం పెరిగి 5,456 పాయింట్లను అధిగమించాయి.

చైనా మినహా మిగతా దేశాలకు ట్రంప్ ఇచ్చిన ఈ తాత్కాలిక ఉపశమనం వల్ల ప్రపంచ మార్కెట్లలో విశ్వాసం కొంత మెరుగైందని చెప్పవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి