Breaking News

వలసదారులపై కఠిన వైఖరి – ట్రంప్ పాలనలో మారుతున్న అమెరికా విధానం

సోషల్ మీడియా వేదికలపై తీవ్రంగా పరిశీలన పెంచిన అమెరికా ప్రభుత్వం, విదేశీయులకు వీసాలు మంజూరు చేసే విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.


Published on: 10 Apr 2025 14:19  IST

డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత, వలసదారులపై కఠిన విధానాలు అమలు చేయడం ప్రారంభించారు. తాజాగా, సోషల్ మీడియా వేదికలపై తీవ్రంగా పరిశీలన పెంచిన అమెరికా ప్రభుత్వం, విదేశీయులకు వీసాలు మంజూరు చేసే విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రత్యేకంగా, జాతివ్యతిరేకంగా లేదా హింసను ప్రోత్సహించే పోస్టులు చేసేవారికి వీసాలు లేదా గ్రీన్‌కార్డులు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.

విద్యార్థి వీసాలు దరఖాస్తు చేసుకునే వారు లేదా ఇతర వలస దారులందరి సోషల్ మీడియా ఖాతాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది. వారు గతంలో ఏమి పోస్టు చేశారు, ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తపరిచారు అనే అంశాలన్నీ ఇప్పుడు కీలకం అవుతున్నాయి.

అమెరికా సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకారం, జాతి లేదా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించిన వారికి వీసాల మంజూరు లేదని స్పష్టం చేశారు. హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నొయెమ్ మాట్లాడుతూ, “ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి వ్యవహరించడం అవసరం” అన్నారు.

అమెరికా విదేశాంగ శాఖకు చెందిన మార్కూ రూబియో ఇటీవల 300 మందికి వీసాలను రద్దు చేసినట్లు తెలిపారు. “వీసాల మంజూరు లేదా తిరస్కరణ న్యాయస్థానాల నిర్ణయంగా కాకుండా, ప్రభుత్వ విధానాల ప్రకారం జరుగుతుంది” అని ఆయన స్పష్టం చేశారు.అంతేకాక, అమెరికా ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిన గ్రూపులకు మద్దతు ఇచ్చే వ్యక్తులపై తీవ్ర చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. హమాస్, హెజ్‌బొల్లా, హూతీలు వంటి సంస్థల గురించి అనుకూలంగా మాట్లాడటం, లేదా సోషల్ మీడియాలో మద్దతుగా పోస్టులు పెట్టడం వంటి చర్యలు, తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఈ నేపథ్యంలో, అమెరికాలో స్థిరపడాలని భావిస్తున్న వారు తమ ఆన్‌లైన్ ప్రవర్తనపైనా, వ్యక్తిత్వంపైనా జాగ్రత్త వహించడం అవసరం. ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉన్నప్పటికీ, వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తపరచేటప్పుడు బాధ్యతగా వ్యవహరించడం తప్పనిసరి అయింది.

Follow us on , &

ఇవీ చదవండి