Breaking News

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌పై ఈడీ చార్జిషీట్: కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం

మనీలాండరింగ్ ఆరోపణలతో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది.


Published on: 16 Apr 2025 12:35  IST

నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి రాజకీయ సంచలనంగా మారింది. మనీలాండరింగ్ ఆరోపణలతో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా చార్జిషీట్ దాఖలు చేసింది.ఈ చర్యపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ, ఇది "ప్రతీకార రాజకీయాలకు నిదర్శనం" అని ఆరోపించింది. ప్రధాని, హోం మంత్రులు తమను బెదిరిస్తున్నారని విమర్శించింది.

వార్తా సంస్థ పీటీఐ తెలిపిన వివరాల ప్రకారం, ఈడీ ఏప్రిల్ 9న చార్జిషీట్‌ను కోర్టులో సమర్పించింది. దీన్ని పరిశీలించిన స్పెషల్ జడ్జి విశాల్ గొగ్నె, ఈ కేసు విచారణను ఏప్రిల్ 25న జరిపేందుకు నిర్ణయించారు.ఈ కేసులో కాంగ్రెస్ నేతలు శామ్ పిట్రోడా, సుమన్ దుబేల పేర్లను కూడా చార్జిషీట్‌లో చేర్చారు. అంతేకాదు, రూ. 661 కోట్ల విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) ఆస్తుల స్వాధీనానికి ఈడీ ప్రాసెస్‌ను ప్రారంభించింది.

నేషనల్ హెరాల్డ్ – చరిత్రలో ఒక అధ్యాయం

1938లో జవహర్‌లాల్ నెహ్రూ స్థాపించిన నేషనల్ హెరాల్డ్ పత్రికను AJL ప్రచురించేది. ఈ సంస్థ ఉర్దూలో క్వామీ ఆవాజ్, హిందీలో నవజీవన్ అనే మరో రెండు వార్తాపత్రికలను కూడా ప్రచురించేది.. ఆ కాలంలో వేలాది మంది స్వాతంత్య్ర సమరయోధులు ఇందులో షేర్ హోల్డర్లుగా ఉండేవారు.ఆర్థిక సమస్యల కారణంగా 2008లో పత్రిక మూతపడగా, 2016లో డిజిటల్ మాధ్యమంగా మళ్లీ పునఃప్రారంభించారు.

బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి 2012లో వేసిన కేసు ప్రకారం, సోనియా, రాహుల్ గాంధీలు కాంగ్రెస్ పార్టీ నిధులను ఉపయోగించి యంగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా AJLను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL) వద్ద ఉన్న రూ. 2,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను తమ అధీనంలోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ నిధులను ఉపయోగించిందని,2008లో నేషనల్ హెరాల్డ్ మూతపడినప్పుడు, AJL సంస్థకు కాంగ్రెస్ పార్టీ నుండి తీసుకున్న రూ. 90 కోట్లు బకాయి ఉండేది. ఆ అప్పు 2010లో యంగ్ ఇండియాకు బదలాయించడంతో, ఆ సంస్థకు ఆస్తులపై హక్కు ఏర్పడింది. ఈ సంస్థలో సోనియా, రాహుల్‌కి చెరో 38% వాటా ఉందని, మిగిలిన వాటాలు ఇతర కాంగ్రెస్ నేతలు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, శామ్ పిట్రోడాలకు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ వ్యవహారంలో యంగ్ ఇండియా సంస్థ, దిల్లీ, లఖ్‌నవూ, ముంబయిలోని విలువైన ఆస్తులపై పూర్తిస్థాయి హక్కును సాధించిందని, లాభాపేక్ష లేని సంస్థగా ఏర్పాటైన యంగ్ ఇండియా ద్వారా వేల కోట్ల విలువైన ఆస్తులను గాంధీ కుటుంబం అక్రమంగా తమ అధీనంలోకి తీసుకున్నారని  స్వామి ఆరోపిస్తున్నారు. 

ఈడీ చర్యలపై కాంగ్రెస్ నిరసన

ఈడీ జప్తు ప్రక్రియలో భాగంగా ముంబయి బాంద్రాలోని హెరాల్డ్ హౌస్‌లోని కొన్ని అంతస్తులకు సంబంధించిన అద్దె రాయితీలను స్వాధీనం చేసుకోవాలని నోటీసులు జారీ చేసింది. జిందాల్ సౌత్ వెస్ట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థకు కూడా చెల్లింపుల విషయంలో సూచనలు చేసింది.

కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ స్పందిస్తూ – “చట్టాల అమలు పేరుతో కేంద్రం దుర్వినియోగానికి దిగుతోంది. కానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఊరుకోదు. సత్యమే గెలుస్తుంది” అని X (ట్విట్టర్)లో పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి